8 ఏళ్ల తర్వాత కూడా అదే తీరు

1 Jan, 2021 13:55 IST|Sakshi

తిరువనంతపురం : టీమిండియా క్రికెటర్‌.. కేరళ స్పీడస్టర్‌ శ్రీశాంత్‌ 8 ఏళ్ల తర్వాత మళ్లీ మైదానంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే సయ్యద్‌ ముస్తాక్‌ టోర్నీకి సంబంధించి కేరళ జట్టు ప్రాబబుల్స్‌లో శ్రీశాంత్‌ చోటు దక్కించుకున్నాడు. జనవరి 10 నుంచి సయ్యద్‌ ముస్తాక్‌ టోర్నీ జరగనుంది. ఈ క్రమంలో తన ప్రాక్టీస్‌ను ఆరంభించిన శ్రీశాంత్‌ 8 ఏళ్ల తర్వాత అదే కోపాన్ని చూపించడం ఆసక్తికరంగా మారింది. (చదవండి : 'ఆ మ్యాచ్‌లో నన్ను‌ గెట్‌ అవుట్‌ అన్నారు')

ఆది నుంచి టీమిండియాలో అగ్రెసివ్‌ క్రికెటర్‌గా పేరు పొందిన శ్రీశాంత్‌కు బాధ వేసినా.. సంతోషం కలిగినా అస్సలు తట్టుకోలేడు. ఎదుటివారిని బోల్తా కొట్టించేందుకు తనదైన శైలిలో కవ్వింపు చర్యలకు పాల్పడేవాడు. శ్రీశాంత్‌ కెరీర్‌లో ఇలాంటివి చాలానే చూశాం. తాజాగా శ్రీశాంత్‌ సయ్యద్‌ ముస్తాక్‌ టోర్నీ సన్నాహకంగా వార్మప్‌ మ్యాచ్‌ల్లో ఆడుతున్నాడు.

ఈ సందర్భంగా శ్రీశాంత్‌ వేసిన బంతిని ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ భారీ షాట్‌ ఆడాడు. ఆ షాట్‌ను కోపంతో చూస్తూ శ్రీశాంత్‌ మళ్లీ పాతరోజులకు వెళ్లిపోయాడు. పిచ్‌పై నిలబడి బ్యాట్స్‌మన్‌పై స్లెడ్జింజ్‌కు దిగాడు.  కాగా శ్రీశాంత్‌ బౌలింగ్‌ వీడియోనూ కేరళ క్రికెట్‌ అసోసియేషన్‌ యూట్యూబ్‌లో షేర్‌ చేసింది. కాగా శ్రీశాంత్‌ చర్యపై నెటిజన్లు తమదైశ శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 8 ఏళ్ల తర్వాత కూడా శ్రీశాంత్‌ తీరులో ఏ మార్పు లేదు. శ్రీశాంత్‌ అంటేనే కోపానికి మారుపేరు.. అతను అలా ఉంటేనే కరెక్ట్‌.. అని పేర్కొన్నారు.

కాగా 2013 ఐపీఎల్‌ సీజన్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో బీసీసీఐ శ్రీశాంత్‌తో పాటు అంకిత్‌ చవాన్‌, అజిత్‌ చండీలాపై జీవితకాలం నిషేధం విధించింది. అయితే బీసీసీఐ శ్రీశాంత్‌పై విధించిన నిషేధాన్ని ఏడేళ్లకి కుదించగా.. గతేడాది సెప్టెంబరుతో అది ముగిసింది. 

మరిన్ని వార్తలు