వాటే స్పెల్‌ రషీద్‌ ఖాన్‌..

27 Oct, 2020 23:02 IST|Sakshi
రషీద్‌ ఖాన్‌(ఫోటో సోర్స్‌-ట్విట్టర్‌)

ఢిల్లీపై సన్‌రైజర్స్‌ భారీ విజయం

దుబాయ్‌:  ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ విజయం సాధించింది. ఢిల్లీని 19 ఓవర్లలో131 పరుగులకే ఆలౌట్‌ చేసి 88  పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌లో కుమ్మేసిన ఆరెంజ్‌ ఆర్మీ.. ఆపై అయ్యర్‌ గ్యాంగ్‌  పనిపట్టింది. 220 పరుగుల భారీ టార్గెట్‌ ఛేదనలో బరిలోకి దిగిన ఢిల్లీని ఏ దశలోనూ తేరుకోనీయలేదు. రషీద్‌ ఖాన్‌ మ్యాజిక్‌ స్పెల్‌కు తలవంచిన ఢిల్లీ ఘోరపరాజయాన్ని చవిచూసింది. సందీప్‌ శర్మ వేసిన తొలి ఓవర్‌ మూడో బంతికి శిఖర్‌ గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. వార్నర్‌ క్యాచ్‌ పట్టడంతో ధావన్‌ పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. కాసేపటికి స్టోయినిస్‌(5)ను నదీమ్‌ బోల్తా కొట్టించాడు. రెండో ఓవర్‌ చివరి బంతికి స్టోయినిస్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో రహానే-హెట్‌మెయిర్‌ జోడి మరమ్మత్తులు చేసింది.(టీమిండియా సెలక్షన్‌పై భజ్జీ ఫైర్‌)

ఈ జోడి 40 పరుగులు జత చేసిన తర్వాత హెట్‌మెయిర్‌(16;13 బంతుల్లో 3 ఫోర్లు) పెవిలియన్‌ చేరాడు. మరో పరుగు వ్యవధిలో రహానే(26; 19 బంతుల్లో 3 ఫోర్లు , 1 సిక్స్‌) కూడా ఔట్‌ కావడంతో ఢిల్లీ 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వీరిద్దర్నీ రషీద్‌ ఖాన్‌ ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపాడు. ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ తొలి బంతికి హెట్‌మెయిర్‌ను ఔట్‌ చేసిన రషీద్‌.. ఐదో బంతికి రహానేను ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు.ఇక శ్రేయస్‌ అయ్యర్‌((7)ను విజయ్‌ శంకర్‌ ఔట్‌ చేయగా, అక్షర్‌ పటేల్‌(1)ను రషీద్‌ ఖాన్‌ ఔట్‌ చేశాడు. ఏడుగురు ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. రిషభ్‌ పంత్‌(36) ఢిల్లీ ఇన్నింగ్స్‌ అత్యధిక స్కోరు నమోదు చేసిన ఆటగాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ మూడు వికెట్లకు జతగా, సందీప్‌ శర్మ, నటరాజన్‌లు చెరో రెండు వికెట్లు సాధించారు. నదీమ్‌, విజయ్‌ శంకర్‌లు తలో వికెట్‌ సాధించారు.

వాటే స్పెల్‌ రషీద్‌..
ఈ మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ అద్భుతమైన స్పెల్‌తో అదరగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 7 పరుగులే ఇచ్చి మూడు వికెట్లును నేలకూల్చాడు. హెట్‌మెయిర్‌ను బౌల్డ్‌ చేసిన రషీద్‌.. రహానేను ఎల్బీగా ఔట్‌ చేశాడు. అక్షర్‌ పటేల్‌ వికెట్‌ను సైతం రషీద్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఈ ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో బెస్ట్‌ బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేశాడు.  అదే సమయంలో అత్యుత్తమ ఎకానమీని కూడా రషీద్‌ లిఖించాడు. ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లాడిన రషీద్‌ ఖాన్‌ మొత్తం 17 వికెట్లను సాధించగా ఎకానమీ 5.00గా ఉంది. అంటే 48 ఓవర్ల బౌలింగ్‌ వేసిన రషీద్‌ 240  పరుగుల్ని ఇచ్చాడు. ఓవర్‌కు ఎకానమీ 5.00గా నమోదైంది. ఇదే ఈ సీజన్‌లో ఇప్పటివరకూ అత్యుత్తమ ఎకానమీ. ఈ క్రమంలోనే ఎకానమీలో ఆర్సీబీ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను వెనక్కినెట్టాడు. వాషింగ్టన్‌ సుందర్‌ ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లాడి 5.72 ఎకానమీతో ఉన్నాడు. సుందర్‌ 37 ఓవర్లు వేసి 212 పరుగులిచ్చాడు. ఇదిలా ఉంచితే, ఈ ఐపీఎల్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాదే విజయం సాధించగా, అక్కడ కూడా రషీద్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీతో తొలి అంచె మ్యాచ్‌లో రషీద్‌ నాలుగు ఓవర్లలో 13 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. (వారిదే టైటిల్‌.. ఆర్చర్‌ జోస్యం నిజమయ్యేనా?)

ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చెలరేగిపోయింది. బ్యాటింగ్‌కు దిగింది మొదలు చివరి వరకూ పరుగుల మోత మెగించింది. చిన్న చిన్న లక్ష్యాలను కూడా ఛేదించలేక చతికిలబడుతున్న ఆరెంజ్‌ ఆర్మీ ఎట్టకేలకు పరుగుల దాహం తీర్చుకుంది. 220 పరుగుల టార్గెట్‌ను బోర్డుపై ఉంచి ఢిల్లీకి సవాల్‌ విసిరింది. వార్నర్‌( 66; 34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), వృద్ధిమాన్‌ సాహా(87; 45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనీష్‌ పాండే(44 నాటౌట్‌; 31 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌)లు చెలరేగి ఆడటంతో సన్‌రైజర్స్‌ రెండు వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు చేసింది.  ఢిల్లీ బౌలర్లలో నోర్జే, అశ్విన్‌లకు తలో వికెట్‌ లభించింది.

టాస్‌ గెలిచిన ఢిల్లీ..  ముందుగా సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.  దాంతో సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ను వార్నర్‌-సాహాలు ఆరంభించారు. బెయిర్‌ స్టోను పక్కకు పెట్టిన సన్‌రైజర్స్‌.. విలియమ్సన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. దాంతో సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ను సాహాతో కలిసి వార్నర్‌ ప్రారంభించాడు.  ఈ జోడీ రబడా వేసిన రెండో ఓవర్‌లోనే 15 పరుగులు సాధించి మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ఆ తర్వాత అదే ఊపును కొనసాగించిన సన్‌రైజర్స్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.  కాగా, 34 బంతుల్లో 8 ఫోర్లు,  2సిక్స్‌లతో  66 పరుగులు సాధించిన వార్నర్‌ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అశ్విన్‌ వేసిన 10 ఓవర్‌ నాల్గో బంతికి వార్నర్‌ పెవిలియన్‌ చేరాడు.10 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్‌ వికెట్‌ నష్టానికి 113 పరుగులు చేసింది. ఆపై సాహా కూడా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 27 బంతుల్లో 8 ఫోర్లతో అర్థ శతకం నమోదు చేశాడు. వార్నర్‌-సాహాల జోడి తొలి వికెట్‌కు 107 పరుగులు చేసి భారీ స్కోరుకు బాటలు వేసింది. ఇది సన్‌రైజర్స్‌కు ఐదో విజయం కాగా, ఢిల్లీకి ఐదో ఓటమి.

మరిన్ని వార్తలు