ముంబై చిత్తు: ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్‌

3 Nov, 2020 23:00 IST|Sakshi

షార్జా: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌కు చేరింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్‌ బెర్తును ఖాయం చేసుకుంది. తొలుత బౌలింగ్‌లో ఇరగదీసిన సన్‌రైజర్స్‌.. బ్యాటింగ్‌లో కూడా దుమ్మురేపింది. సాహా, డేవిడ్‌ వార్నర్‌లు తొలి వికెట్‌కు భారీ భాగస్వామ్యం సాధించడంతో ఆరెంజ్‌ ఆర్మీ అలవోకగా జయకేతనం ఎగురవేసింది. డేవిడ్‌ వార్నర్‌(85 నాటౌట్‌; 58 బంతుల్లో 10 ఫోర్లు, 1సిక్స్‌), సాహా(58నాటౌట్‌; 45 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్‌)లు చివరి వరకు క్రీజ్‌లో ఉండి విజయాన్ని అందించారు. సన్‌రైజర్స్‌ 17.1 ఓవర్లలో  వికెట్లు కోల్పోకుండా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో సన్‌రైజర్స్‌ మూడో స్థానానికి చేరింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ముంబై ఆటగాళ్లలో పొలార్డ్‌(41; 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), డీకాక్‌(25; 13 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు), సూర్యకుమార్‌( 36; 29 బంతుల్లో 5 ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌(33: 30 బంతుల్లో 1 ఫోర్‌, 2సిక్స్‌లు)లు మాత్రమే ఆడగా మిగతా వారు విఫలమయ్యారు. సన్‌రైజర్స్‌ బౌలర్లు ఇరగదీసి ముంబైను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకోవడంతో ముంబై బ్యాటింక్‌కు దిగింది. ముంబై ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ, డీకాక్‌లు ఆరంభించారు.  కాగా, సందీప్‌ శర్మ వేసిన మూడో ఓవర్‌ మూడో బంతికి రోహిత్‌(4) ఔటయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌- డీకాక్‌లు ఇన్నింగ్స్‌ను నడిపించారు. 

డీకాక్‌ అయితే అత్యంత దూకుడుగా కనిపించాడు. సందీప్‌ శర్మ వేసిన ఐదో ఓవర్‌లో వరుస రెండు సిక్స్‌లు కొట్టిన డీకాక్‌.. అదే ఓవర్‌ ఐదో బంతికి బౌల్డ్‌ అయ్యాడు. బంతి ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ గిరాటేయడంతో డీకాక్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఆపై సూర్యకుమార్‌ యాదవ్‌-ఇషాన్‌ కిషన్‌లు మరోసారి బ్యాట్‌ ఝుళిపించారు. అయితే నదీమ్‌ వేసిన 12 ఓవర్‌ తొలి బంతికి సూర్యకుమార్‌ స్టంపౌట్‌ కాగా,  ఆ ఓవర్‌ నాల్గో బంతికి కృనాల్‌ పాండ్యా డకౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత రషీద్‌ వేసిన 13 ఓవర్‌ తొలి బంతికి సౌరవ్‌ తివారీ(1) ఔటయ్యాడు. సాహా క్యాచ్‌ పట్టడంతో తివారీ పెవిలియన్‌ చేరాడు. ఫలితంగా పరుగు వ్యవధిలో ముంబై ఇండియన్స్‌ మూడు వికెట్లు కోల్పోయింది.

39 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయిన ముంబై.. 82 పరుగుల స్కోరు చేరే సరికి ఐదు వికెట్ల నష్టపోయింది.  ఆ తరుణంలో ఇషాన్‌ కిషన్‌-పొలార్డ్‌లు స్కోరును చక్కదిద్దే యత్నం చేశారు. ఈ జోడి 33 పరుగులు జత చేసిన తర్వాత ఇషాన్‌ కిషన్‌ ఆరో వికెట్‌గా ఔటయ్యాడు. సందీప్‌ శర్మ వేసిన 17 ఓవర్‌ మూడో బంతికి బౌల్డ్‌ అయ్యాడు. హోల్డర్‌ వేసిన 18 ఓవర్‌ రెండో బంతికి కౌల్టర్‌ నైల్‌(1) ఔటయ్యాడు.  చివర్లో పొలార్డ్‌ మెరుపులు మెరిపించాడు. నటరాజన్‌ వేసిన 19 ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌లు కొట్టడమే కాకుండా , హోల్డర్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో సిక్స్‌ కొట్టిన తర్వాత బంతికి బౌల్డ్‌ అయ్యాడు.సన్‌రైజర్స్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ మూడు వికెట్లు సాధించగా, నదీమ్‌,హోల్డర్‌ చెరో రెండు వికెట్లు తీశాడు.  రషీద్‌ ఖాన్‌కు వికెట్‌ దక్కింది.

>
మరిన్ని వార్తలు