‘నటరాజన్‌.. నిప్పులు చెరిగే బంతులవి’

30 Sep, 2020 14:29 IST|Sakshi

న్యూఢిల్లీ: తొలి రెండు మ్యాచుల్లో గెలుపు రుచి చూడని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మూడో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఢిల్లీతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 162 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్ల దెబ్బతో ఏ దశలోనూ గెలుపు దిశగా పయనించలేదు. భువనేశ్వర్‌ (4–0–25–2), రషీద్‌ ఖాన్‌ (4–0–14–3) రాణించడంతో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలయ్యారు. ముఖ్యంగా చక్కని యార్కర్లతో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ నటరాజన్‌ (4–0–29–1) యార్కర్‌ షోపై బీసీసీఐ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. (చదవండి: హెలికాప్టర్‌ షాట్‌ ఇరగదీశాడుగా..!)

సెన్సేషనల్‌ బౌలింగ్‌ పర్మార్మెన్స్‌ అంటూ ప్రశంసించింది. ఈ వీడియోపై సోషల్‌ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. అద్భుతమైన యార్కర్లతో ఆకట్టుకున్నావ్‌. మంచి భవిష్యత్‌ ఉంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రాకెట్‌లా దూసుకొచ్చిన బంతి మార్కస్‌ స్టొయినిస్‌ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న తీరు అమోఘం అంటూ మెచ్చుకుంటున్నారు. నిప్పుల్లా దూసుకొస్తున్న బంతులతో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ ను బెంబేలెత్తించావని చెప్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రషీద్‌ని మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌‌ వరించింది. కాగా, తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన నటరాజన్‌ గతంలో రైజింగ్‌ పుణె, కింగ్స్‌ పంజాబ్‌ తరపున ఐపీఎల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. (చదవండి: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మొదటి విజయం)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు