Muttiah Muralitharan: రషీద్‌ ఖాన్‌ రేంజ్‌లో మేము లేము.. ఎస్‌ఆర్‌హెచ్‌ కోచ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

13 Apr, 2022 14:11 IST|Sakshi
Photo Courtesy: IPL

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాడు, గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌ను ఉద్దేశించి ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ కోచ్‌ ముత్తయ్య మురళీథరన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2017 నుంచి 2021 ఐపీఎల్‌ సీజన్‌ వరకు ఎస్‌ఆర్‌హెచ్‌లో భాగమైన రషీద్‌ ఖాన్‌ను ఆటగాళ్ల రిటెన్షన్‌లో భాగంగా అట్టిపెట్టుకునేందుకు చాలా ప్రయత్నాలే చేశామని, అయితే అతని రేంజ్‌లో (రెమ్యునరేషన్‌) మేము లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వదులుకోవాల్సి వచ్చిందని కీలక కామెంట్స్‌ చేశాడు. 

రషీద్ ఖాన్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుందని సోషల్‌మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో మురళీథరన్‌ పై విధంగా స్పందించాడు. రషీద్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ కుటుంబంలో మాజీ సభ్యుడు.. అతనిపై ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యానికి కానీ తమ అభిమానులకు కానీ ఎలాంటి పగ, ప్రతీకారాలు లేవు.. రిటెన్షన్‌లో రషీద్‌ను దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశాము.. అయితే అతను అడిగినంత మేం ఇవ్వలేకపోయామంటూ మురళీథరన్‌ వివరణ ఇచ్చాడు. 

కాగా, పాకిస్థాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో రూ.కోటి 70 లక్షలు మాత్రమే తీసుకునే రషీద్‌.. ఐపీఎల్‌ 2022 సీజన్‌కు ముందు జరిగిన ఆటగాళ్ల రిటెన్షన్‌లో ఏకంగా రూ.15 కోట్లు డిమాండ్ చేశాడని వార్తలు వచ్చాయి. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్ కోచ్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో రషీద్‌ అధిక రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేసిన వార్త నిజమేనని స్పష్టమవుతుంది. 

ఇదిలా ఉంటే, సన్‌రైజర్స్‌ వదులుకున్న రషీద్‌ ఖాన్‌ను ఐపీఎల్ న్యూ ఎంట్రీ గుజరాత్ టైటాన్స్ రూ.15 కోట్లు వెచ్చించి డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేయగా, ఎస్‌ఆర్‌హెచ్‌.. కేన్ విలియమ్సన్‌ను రూ.12 కోట్లకు, అన్‌క్యాప్డ్ ప్లేయర్లు అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లకు చెరి 4 కోట్లు ఇచ్చి రీటైన్‌ చేసుకుంది. సనరైజర్స్‌ రషీద్‌ ఖాన్‌ను 2017లో రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఫ్రాంచైజీ తరఫున 76 మ్యాచ్‌లు ఆడిన అతను 6.35 ఎకానమీతో 93 వికెట్లు పడగొట్టి, ఫ్రాంచైజీ తరఫున రెండో అత్యధిక వికెట్‌ టేకర్‌గా రికార్డుల్లో నిలిచాడు. 
చదవండి: IPL 2022: ఆర్సీబీ టైటిల్‌ నెగ్గే వరకు ఆ అమ్మడు పెళ్లి చేసుకోదట..!

మరిన్ని వార్తలు