మెరిసిన మనీష్‌ పాండే..

11 Oct, 2020 17:16 IST|Sakshi

దుబాయ్‌: రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 159 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. డేవిడ్‌ వార్నర్‌(48; 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనీష్‌ పాండే(54; 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు రాణించడంతో ఆరెంజ్‌ ఆర్మీ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ను వార్నర్‌, బెయిర్‌ స్టోలు ఆరంభించారు. కాగా, బెయిర్‌ స్టో(16) నిరాశపరచగా, వార్నర్‌ మాత్రం మరొకసారి ఆకట్టుకున్నాడు.  అతనికి మనీష్‌ పాండే నుంచి మంచి సహకారం లభించింది. ఈ జోడి 73 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత వార్నర్‌ పెవిలియన్‌ చేరాడు. మనీష్‌ పాండే మాస్టర్‌ క్లాస్‌తో మెరిశాడు. బంతి స్లోగా బ్యాట్‌పైకి వస్తున్నా తడబాటు లేకుండా హాఫ్‌ సెంచరీ సాధించాడు. దాంతో సన్‌రైజర్స్‌ తిరిగి తేరుకుంది. చివర్లో విలియమ్సన్‌ మెరుపులు మెరిపించడంతో ఆరెంజ్‌ ఆర్మీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, కార్తీక్‌ త్యాగి, ఉనాద్కత్‌లకు తలో వికెట్‌ లభించింది.(ఆ ఇద్దరి కెప్టెన్లకు థాంక్స్‌: దినేశ్‌ కార్తీక్‌)

ఈ మ్యాచ్‌ల టాస్‌ గెలిచిన వెంటనే వార్నర్‌ మరో మాట లేకుండా బ్యాటింగ్‌కు వెళ్లాడు. కానీ అది మంచి నిర్ణయం కాదని ఫీల్డ్‌లోకి దిగిన తర్వాత అర్థమైంది. బంతి ఎక్స్‌ట్రా బౌన్స్‌ కావడంతో పాటు పిచ్‌ స్లోగా మారిపోవడంతో బౌండరీలు రావడం కష్టమైంది. కార్తీక్‌ త్యాగి వేసిన స్లో బాల్‌ను హిట్‌ చేసే క్రమంలో బెయిర్‌ స్టో క్యాచ్‌ ఇచ్చి తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తరుణంలో వార్నర్‌కు మనీష్‌ కలిశాడు. వీరు స్టైక్‌ రొటేట్‌ చేస్తూ సింగిల్స్‌ ,డబుల్స్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో ఫోర్లను పక్కను పెట్టి భారీ షాట్లపైనే గురిపెట్టారు. బౌండరీలు రావడం కష్టం కావడంతో సిక్స్‌ర్లకే వీరు మొగ్గుచూపారు. వార్నర్‌ మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లు కొడితే, మనీష్‌ పాండే రెండు ఫోర్లు,  3సిక్స్‌లు కొట్టాడు. ఇక కేన్‌ విలియమ్సన్‌ 12 బంతుల్లో 22 పరుగులు చేయగా అందులో 2 సిక్స్‌లు ఉన్నాయి. ప్రియాం గార్గ్‌ 8 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌ సాయంతో 15 పరుగులు చేశాడు. వీరిద్దరూ చివరి రెండు ఓవర్లలో 35 పరుగులు సాధించడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ 150 పరుగుల మార్కును దాటింది.
 

మరిన్ని వార్తలు