ఇక సన్‌రైజర్స్‌ బౌలర్లదే భారం..

29 Sep, 2020 21:29 IST|Sakshi

అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 163  పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. సన్‌రైజర్స్‌ ఆటగాళ్లలో డేవిడ్‌ వార్నర్‌(45; 33 బంతుల్లో 3 ఫోర్లు,  2 సిక్స్‌లు), జానీ బెయిర్‌ స్టో(53; 48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), కేన్‌ విలియమ్సన్‌( 41; 26 బంతుల్లో  5 ఫోర్లు)లు రాణించడంతో పోరాడే స్కోరును ఉంచకల్గింది. టాస్‌ గెలిచిన ఢిల్లీ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకోవడంతో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌కు దిగింది. సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ను వార్నర్‌, బెయిర్‌ స్టోలు ధాటిగా ఆరంభించారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 77 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత వార్నర్‌ ఔటయ్యాడు.

అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. వార్నర్‌ బ్యాట్‌ ఎడ్జ్‌కు తగిలిన బంతిని పంత్‌ పట్టడంతో పెవిలియన్‌ చేరాడు. ఇక మనీష్‌ పాండే(3) నిరాశపరిచాడు. మిశ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడే ప‍్రయత్నంలో రబడా క్యాచ్‌ పట్టడంతో పాండే ఔటయ్యాడు. ఆ తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన విలియమన్స్‌ ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న విలియమన్స్‌ వచ్చిన దగ్గర నుంచి మంచి టచ్‌లో కనిపించాడు. బెయిర్‌ స్టోతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. బెయిర్‌ స్టో మూడో వికెట్‌గా ఔట్‌ కాగా, రబడా వేసిన ఆఖరి ఓవర్‌లో షాట్‌ కొట్టిన విలియమ్సన్‌ పెవిలియన్‌ చేరాడు. అబ్దుల్‌ సామద్‌(12 నాటౌట్‌; 7 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించడంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో రబడా, మిశ్రాలు తలో రెండు వికెట్లు సాధించారు.ఈ సాధారణ స్కోరును కాపాడుకోవాలంటే సన్‌రైజర్స్‌ బౌలర్లు రాణించాలి. ఇక భారం ఆరెంజ్‌ ఆర్మీ బౌలర్లదే.

మరిన్ని వార్తలు