మయాంక్‌ అగర్వాల్‌ దూరం

24 Oct, 2020 19:09 IST|Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌.. ముందుగా కింగ్స్‌ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో ఆరెంజ్‌ ఆర్మీ 69 పరుగుల తేడాతో విజయం సాధించింది.  ఎస్‌ఆర్‌హెచ్‌ ముందుగా బ్యాటింగ్‌ చేసి 201 పరుగులు చేయగా, కింగ్స్‌ పంజాబ్‌ 132 పరుగులకే కుప్పకూలింది. ఇక ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య ఓవరాల్‌గా 15 మ్యాచ్‌లు జరగ్గా అందులో ఎస్‌ఆర్‌హెచ్‌ 11 సార్లు విజయం సాధించగా, కింగ్స్‌ పంజాబ్‌ 4 విజయాలు మాత్రమే అందుకుంది. ఈ సీజన్‌లో ఇరుజట్లు ఇప్పటివరకూ తలో 10 మ్యాచ్‌లు ఆడి నాలుగేసి విజయాలు సాధించాయి.  దాంతో ఇక నుంచి ప్రతీ మ్యాచ్‌ ఇరుజట్లకు కీలకం. ఈ మ్యాచ్‌లో ఆరెంజ్‌ ఆర్మీ ఒక మార్పు చేసింది నదీమ్‌ స్థానంలో ఖలీల్‌ను జట్టులోకి తీసుకుంది.మరొకవైపు కింగ్స్‌ పంజాబ్‌ రెండు మార్పులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌, జిమ్మీ నీషమ్‌లు ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. వారి స్థానాల్ల మన్‌దీప్‌ సింగ్‌, క్రిస్‌ జోర్డాన్‌లను తుది జట్టులోకి తీసుకుంది.

ఇరుజట్ల మధ్య స్టార్‌ ఆటగాళ్లు ఉండటంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా జరగవచ్చు. కింగ్స్‌ పంజాబ్‌ జట్టు బ్యాటింగ్‌ విభాగంలో కేఎల్‌ రాహుల్‌(540), మయాంక్‌ అగర్వాల్‌(398), పూరన్‌(295)లు టాప్‌ ఫెర్ఫామర్స్‌గా ఉండగా బౌలింగ్‌ విభాగంలో మహ్మద్‌ షమీ(16), రవి బిష్నోయ్‌(9), మురుగన్‌ అశ్విన్‌(7)లు కీలక పాత్ర పోషిస్తున్నారు. 

మరొకవైపు సన్‌రైజర్స్‌ జట్టు బ్యాటింగ్‌ విభాగంలో డేవిడ్‌ వార్నర్‌(335), జోనీ బెయిర్‌ స్టో(326), మనీష్‌ పాండే(295)లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బౌలింగ్‌ విషయానికొస్తే రషీద్‌ ఖాన్‌(12), నటరాజన్‌(11), ఖలీల్‌ అహ్మద్‌(8)లు టాప్‌ ఫెర్మమర్స్‌గా ఉన్నారు. ప్రధానంగా స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ మంచి ఫామ్‌లో ఉండటంతో ప్రత్యర్థి ఆటగాళ్లు అతని బౌలింగ్‌లో సాహసం చేయడానికి భయపడుతున్నారు. 

వార్నర్‌ వర్సెస్‌ షమీ
ఈ రోజు ఇరుజట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో వార్నర్‌-షమీల్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. సన్‌రైజర్స్‌ జట్టులో వార్నర్‌ టాప్‌ స్కోరర్‌గా ఉండగా, కింగ్స్‌ పంజాబ్‌ జట్టు షమీ టాప్‌ బౌలర్‌గా ఉన్నాడు. ఈ ఐపీఎల్‌లో వార్నర్‌ ఆడపా దడపా మెరుస్తూ ఉండటంతో అతని స్టైక్‌రేట్‌ అంత బాలేదు. కేవలం 124.07 స్టైక్‌రేట్‌తో మాత్రమే వార్నర్‌ ఉన్నాడు. ఇది టీ20 మ్యాచ్‌ల్లో ఆకర్షణీయమైన స్టైక్‌రేట్‌ కాదు. ఇక షమీ ఎకానమీ 8.43గా ఉంది. దాంతో షమీ బౌలింగ్‌లో వార్నర్‌ ఎంతవరకూ రాణిస్తాడనేది ఆసక్తికరం.

మరిన్ని వార్తలు