ఖలీల్‌ అహ్మద్‌ ఔట్‌

18 Oct, 2020 15:08 IST|Sakshi

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఆరెంజ్‌ ఆర్మీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ .. ముందుగా కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ కేకేఆర్‌ ఎనిమిది మ్యాచ్‌లాడి నాలుగు విజయాలు సాధించగా, సన్‌రైజర్స్‌ హైదరబాద్‌ ఎనిమిది మ్యాచ్‌లకు గాను మూడు విజయాలు మాత్రమే సాధించింది. ఓవరాల్‌గా ఇరు జట్లు 18 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా కేకేఆర్‌ 11సార్లు విజయం సాధించగా, ఎస్‌ఆర్‌హెచ్‌ 7 సార్లు గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఖలీల్‌ అహ్మద్‌ స్థానంలో బాసిల్‌ థంపిని జట్టులోకి తీసుకున్నారు. అబ్దుల్‌ సామద్‌ తిరిగి జట్టులో చేరాడు. మరొకవైపు కేకేఆర్‌ కూడా రెండు మార్పులు చేసింది. కుల్దీప్‌ యాదవ్‌, లూకీ ఫెర్గ్యూసన్‌లు తుదిజట్టులోకి వచ్చారు. క్రిస్‌ గ్రీన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణలకు విశ్రాంది ఇచ్చారు.

హైదరబాద్‌ జట్టులో డేవిడ్‌ వార్నర్‌(284 పరుగులు), జానీ బెయిర్‌ స్టో(280 పరుగులు), మనీష్‌ పాండే(206 పరుగులు)లు బ్యాటింగ్‌కు ప్రధాన బలం. వీరు ముగ్గురు రాణిస్తే ఎస్‌ఆర్‌హెచ్‌కు తిరుగుండదు. ఇక బౌలింగ్‌ విభాగంలో రషీద్‌ ఖాన్‌(10 వికెట్లు), నటరాజన్‌(9 వికెట్లు), ఖలీల్‌ అహ్మద్‌(8 వికెట్లు) కీలకం.మరొకవైపు కేకేఆర్‌ జట్టులో శుబ్‌మన్‌ గిల్‌(275 పరుగులు), ఇయాన్‌ మోర్గాన్‌(215), నితీష్‌ రాణా(155 పరుగులు) ప్రధాన బలం కాగా, రాహుల్‌ త్రిపాఠి మరొకసారి బ్యాట్‌ ఝుళిపిస్తే కేకేఆర్‌ గాడిన పడుతుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో విఫలమైన కేకేఆర్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌కు గట్టిపోటీ ఇవ్వాలిన చూస్తోంది. కేకేఆర్‌ బౌలింగ్‌ యూనిట్‌లో వరుణ్‌ చక‍్రవర్తి(6 వికెట్లు), శివం మావి(6 వికెట్లు), ఆండ్రీ రసెల్‌(6 వికెట్లు)లు ఫర్వాలేదనిపిస్తున్నారు. 

రషీద్‌ ఖాన్‌ వర్సెస్‌ రసెల్‌
ఈ సీజన్‌లో కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకూ 83 పరుగులు మాత్రమే చేశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో రసెల్‌ 9 బంతుల్లో 12 పరుగులే చేసి పెవిలియన్‌ చేరాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగనున్న మ్యాచ్‌లో రసెల్‌ గాడిలో పడతాడని కేకేఆర్‌ ఆశిస్తోంది. కాకపోతే బౌలింగ్‌లో రాణిస్తున్న ఎస్‌ఆర్‌హెచ్‌పై రసెల్‌ ఎంతవరకూ ఆడతాడనే ప్రశ్న తలెత్తుతోంది. ఆరెంజ్‌ ఆర్మీకి ప్రధాన బౌలింగ్‌ ఆయుధం రషీద్‌ ఖాన్‌. తన  స్పిన్‌ మాయాజాలంతో ప్రత్యర్థులను కట్టిపడేస్తున్నాడు. దాంతో రషీద్‌ ఖాన్‌ను సవాల్‌ చేయడం రసెల్‌కు చాలెంజ్‌గా మారవచ్చు.

ఎస్‌ఆర్‌హెచ్‌
డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), బెయిర్‌ స్టో, మనీష్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌, ప్రియాంగార్గ్‌, విజయ్‌ శంకర్‌, అబ్దుల్‌ సామద్‌, రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌, బాసిల్‌ థంపి

కేకేఆర్‌
ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), రాహుల్‌ త్రిపాఠి, శుబ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణా, దినేశ్‌ కార్తీక్‌, ఆండ్రీ రసెల్‌, ప్యాట్‌ కమిన్స్‌, శివం మావి, కుల్దీప్‌ యాదవ్‌, ఫెర్గ్యూసన్‌, వరుణ్‌ చక్రవర్తి

మరిన్ని వార్తలు