ICC WC Super League: సిరీస్‌ సమం చేసిన శ్రీలంక.. ఇంకో రెండు మ్యాచ్‌లు గెలిస్తే నేరుగా..

1 Dec, 2022 11:56 IST|Sakshi

Afghanistan tour of Sri Lanka, 2022- Sri Lanka vs Afghanistan, 3rd ODI: అఫ్గనిస్తాన్‌పై విజయంతో ఐసీసీ వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌ పాయింట్ల పట్టికలో ఒక స్థానం మెరుగుపరుచుకుంది శ్రీలంక. వచ్చే ఏడాది భారత్‌ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి నేరుగా అర్హత సాధించే క్రమంలో ముందడుగు వేసింది. కాగా దసున్‌ షనక బృందం అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడింది.

మొదటి మ్యాచ్‌లో అఫ్గన్‌ గెలుపొందగా.. రెండో మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. ఈ క్రమంలో సిరీస్‌ విజేతను తేల్చే బుధవారం నాటి నిర్ణయాత్మక వన్డేలో ఆతిథ్య లంక 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది.


PC: ICC

ఈ విజయంతో పది పాయింట్లు ఖాతాలో వేసుకున్న శ్రీలంక.. ఐర్లాండ్‌ను వెనక్కినెట్టి తొమ్మిదో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం 77 పాయింట్లతో ఉన్న దసున్‌ షనక బృందం..ఈ సైకిల్‌లో మరో మూడు వన్డేలు ఆడనుంది. 

వీటిలో కనీసం రెండు గెలిచినా వెస్టిండీస్‌ను వెనక్కి నెట్టి ఎనిమిదో స్థానానికి ఎగబాకుతుంది. తద్వారా ప్రపంచకప్‌-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది. మరోవైపు అఫ్గన్‌ ఈ టేబుల్‌లో ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. కాగా టాప్‌-8లో ఉన్న జట్లు మాత్రమే ఈ ఐసీసీ ఈవెంట్‌కు నేరుగా క్వాలిఫై అవుతాయన్న విషయం తెలిసిందే.

శ్రీలంక వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌
వేదిక: పల్లకెలె
టాస్‌: అఫ్గనిస్తాన్‌.. బ్యాటింగ్‌
అఫ్గనిస్తాన్‌ స్కోరు: 313-8 (50 ఓవర్లలో)
శ్రీలంక స్కోరు: 314-6 (49.4 ఓవర్లలో)
విజేత: నాలుగు వికెట్ల తేడాతో లంక గెలుపు

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: చరిత్‌ అసలంక (72 బంతుల్లో 5 ఫోర్లు, నాలుగు సిక్స్‌ల సాయంతో 83 పరుగులు.. నాటౌట్‌)
అఫ్గనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌: ఇబ్రహీం జద్రాన్‌ (138 బంతుల్లో 162 పరుగులు)

చదవండి: Shikhar Dhawan: పంత్‌కు అండగా నిలబడాలి... సంజూ ఇంకొంత కాలం ఆగాల్సిందే.. ఎందుకంటే!
Ind Vs NZ: 12 బంతుల తేడాతో టీమిండియాకు తప్పిన పరాజయం! ఎలాగంటే..
SL Vs AFG: ఒకేరోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు లంక యువ క్రికెటర్లు! ఓవైపు సిరీస్‌ ఆడుతూనే..

మరిన్ని వార్తలు