IND Vs SL 3rd ODI: లంక ఎట్టకేలకు...

24 Jul, 2021 03:49 IST|Sakshi

10 మ్యాచ్‌ల తర్వాత స్వదేశంలో భారత్‌పై విజయం

రాణించిన అవిష్క, రాజపక్స

చివరి వన్డేలో ఓడిన టీమిండియా

సిరీస్‌ 2–1తో సొంతం  

కొలంబో: ఇప్పటికే సిరీస్‌ను చేజార్చుకున్న శ్రీలంక జట్టుకు ఓదార్పు విజయం దక్కింది. సొంతగడ్డపై భారత్‌ చేతిలో 10 మ్యాచ్‌ల పరాజయాల పరంపరకు తెరదించుతూ ఎట్టకేలకు శ్రీలంక విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్‌ సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. తొలుత భారత్‌ 43.1 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది.

ఓపెనర్‌ పృథ్వీ షా (49 బంతుల్లో 49; 8 ఫోర్లు), అరంగేట్రం చేసిన సంజూ సామ్సన్‌ (46 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (37 బంతుల్లో 40; 7 ఫోర్లు) రాణించారు. అకిల ధనంజయ, ప్రవీణ్‌ జయవిక్రమ చెరో మూడు వికెట్లు సాధించి భారత్‌ను తక్కువ స్కోరుకే కట్డడి చేశారు. ఛేజింగ్‌లో శ్రీలంక 39 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 227 పరుగులు చేసి నెగ్గింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవిష్క ఫెర్నాండో (98 బంతుల్లో 76; 4 ఫోర్లు, 1 సిక్స్‌), భానుక రాజపక్స (56 బంతుల్లో 65; 12 ఫోర్లు) అర్ధ సెంచరీలతో జట్టుకు గెలుపు బాటలు వేశారు. సూర్యకుమార్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఆదివారం మొదలవుతుంది.  

ఆ ముగ్గురు మినహా...
టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. పృథ్వీ షా, సామ్సన్, సూర్యకుమార్‌ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. మనీశ్‌ పాండే (11), హార్దిక్‌ (19; 3 ఫోర్లు) నిరాశ పరిచారు. సూర్యకుమార్‌ మరోసారి నిలకడగా బ్యాటింగ్‌ చేశాడు. అతడు ధాటిగా ఆడటంతో  భారత్‌ భారీ స్కోరు చేసేలా కనిపించింది. 31వ ఓవర్‌లో అకిల ధనంజయ వేసిన బంతి సూర్యకుమార్‌ ప్యాడ్‌లను తాకగా... అతడు ఎల్బీ కోసం అప్పీల్‌ చేశాడు. అంపైర్‌ ధర్మసేన ఆ అప్పీల్‌ను తిరస్కరించడంతో శ్రీలంక రివ్యూకి వెళ్లింది. అక్కడ అవుట్‌గా తేలడంతో సూర్యకుమార్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. ఆ తర్వాత టీమిండియా ఇన్నింగ్స్‌ ముగియడానికి ఎంతోసేపు పట్టలేదు. భారత్‌ 68 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లను చేజార్చుకుంది.

కీలక భాగస్వామ్యం
శ్రీలంక విజయం సాధించాలంటే ఒక పెద్ద భాగస్వామ్యం అవసరం కాగా... ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ అవిష్క, రాజపక్స అదే చేశారు. మినోద్‌ భానుక (7; 1 ఫోర్‌) త్వరగా అవుటైనా సూపర్‌ ఫామ్‌లో ఉన్న అవిష్క మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరు రెండో వికెట్‌కు 109 పరుగులు జోడించారు. ధావన్‌ మళ్లీ సకారియాను బౌలింగ్‌కు తీసుకురాగా... అతడు తన వరుస ఓవర్లలో రాజపక్స, ధనంజయ డిసిల్వా (2)లను అవుట్‌ చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత రాహుల్‌ చహర్‌ షనక (0), అవిష్క, కరుణరత్నే (3)లను వెంటవెంటనే అవుట్‌ చేయడంతో మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. అయితే క్రీజులో ఉన్న రమేశ్‌ మెండిస్‌ (15 నాటౌట్‌; 1 ఫోర్‌) విన్నింగ్‌ షాట్‌ కొట్టాడు.

ఐదుగురు అరంగేట్రం
ఈ మ్యాచ్‌లో భారత్‌ ఏకంగా ఆరు మార్పులు  చేసింది. ఇందులో ఐదుగురు (సామ్సన్, నితీశ్‌ రాణా, రాహుల్‌ చహర్, సకారియా, కృష్ణప్ప గౌతమ్‌) వన్డేల్లో అరంగేట్రం చేశారు. 1980 డిసెం బర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో భారత్‌ దిలీప్‌ దోషి, కీర్తి ఆజాద్, రోజర్‌ బిన్నీ, సందీప్‌ పాటిల్, తిరుమలై శ్రీనివాసన్‌లను బరిలోకి దింపింది.  

వానతో ఆటకు ఆటంకం
భారత్‌ ఇన్నింగ్స్‌లో మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలాడు. ఇన్నింగ్స్‌ 22వ ఓవర్‌ ముగిసిన తర్వాత స్టేడియాన్ని వర్షం ముంచెత్తింది. దాదాపు మ్యాచ్‌ గంటా 40 నిమిషాల సేపు ఆగిపోయింది. దాంతో అంపైర్లు మ్యాచ్‌ను ఇన్నింగ్స్‌కు 47 ఓవర్ల చొప్పున కుదించారు. డక్‌వర్త్‌ పద్ధతిని అనుసరించిన అంపై ర్లు భారత్‌కు ఒక పరుగును అదనంగా చేర్చారు. దాంతో లంక టార్గెట్‌ 227 పరుగులుగా మారింది.

స్కోరు వివరాలు
భారత ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (ఎల్బీ) (బి) షనక 49; ధావన్‌ (సి) మినోద్‌ (బి) చమీర 13; సామ్సన్‌ (సి) అవిష్క (బి) జయవిక్రమ 46; మనీశ్‌ (సి) మినోద్‌ (బి) జయవిక్రమ 11; సూర్యకుమార్‌ (ఎల్బీ) (బి) అకిల ధనంజయ 40; హార్దిక్‌ (ఎల్బీ) (బి) జయవిక్రమ 19; నితీశ్‌ రాణా (సి) మినోద్‌ (బి) అకిల ధనంజయ 7; కృష్ణప్ప గౌతమ్‌ (ఎల్బీ) (బి) అకిల ధనంజయ 2; రాహుల్‌ చహర్‌ (సి అండ్‌ బి) కరుణరత్నే 13; సైనీ (సి) అవిష్క (బి) చమీర 15; సకారియా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం (43.1 ఓవర్లలో ఆలౌట్‌) 225  
వికెట్ల పతనం: 1–28, 2–102, 3–118, 4–157, 5–179, 6–190, 7–194, 8–195, 9–224, 10–225.
బౌలింగ్‌: చమీర 8.1–0–55–2, అకిల ధనంజయ 10–0–44–3, కరుణరత్నే 6–0–25–1, జయవిక్రమ 10–0–59–3, షనక 8–0–33–1, రమేశ్‌ మెండిస్‌ 1–0–8–0.  

శ్రీలంక ఇన్నింగ్స్‌: అవిష్క (సి) పృథ్వీ షా (బి) రాహుల్‌ చహర్‌ 76; మినోద్‌ (సి) సకారియా (బి) గౌతమ్‌ 7; రాజపక్స (సి) గౌతమ్‌ (బి) సకారియా 65; ధనంజయ డిసిల్వా (సి అండ్‌ బి) సకారియా 2; అసలంక (ఎల్బీ) (బి) హార్దిక్‌ 24; షనక (సి) మనీశ్‌ (బి) రాహుల్‌ చహర్‌ 0; రమేశ్‌ మెండిస్‌ (నాటౌట్‌) 15; కరుణరత్నే (స్టంప్డ్‌) (బి) రాహుల్‌ చహర్‌ 3; అకిల ధనంజయ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు: 30; మొత్తం (39 ఓవర్లలో 7 వికెట్లకు) 227
వికెట్ల పతనం: 1–35, 2–144, 3–151, 4–194, 5–195, 6–214, 7–220.
బౌలింగ్‌: సైనీ 5–0–27–0, సకారియా 8–0–34–2, రాహుల్‌ చహర్‌ 10–0–54–3, కృష్ణప్ప గౌతమ్‌ 8–0–49–1, హార్దిక్‌ పాండ్యా 5–0–43–1, నితీశ్‌ రాణా 3–0–10–0.  
అవిష్క, రాజపక్స 

మరిన్ని వార్తలు