బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్న లంక క్రికెట్‌ బోర్డ్‌ 

7 Jun, 2021 16:31 IST|Sakshi

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచక‌ప్‌ను యూఏఈలో నిర్వహించాల‌ని బీసీసీఐ.. ఎమిరేట్స్‌ క్రికెట్ బోర్డ్‌తో మంత‌నాలు జ‌రుపుతున్న నేపథ్యంలో తాజాగా మరో దేశం పేరు తెరపైకి వచ్చింది. టోర్నీ నిర్వహించేందుకు తాము కూడా రేసులో ఉన్నామని శ్రీలంక క్రికెట్‌ బోర్డ్‌ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐతో సంప్రదింపులు జ‌రుపుతున్నట్లు ఓ మీడియా సంస్థ ద్వారా వెల్లడైంది. కాగా, ఇప్పటికే యూఏఈలో ఐపీఎల్ సెకండాఫ్‌ మ్యాచ్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ షెడ్యూల్‌ ఖరారు చేసింది. 

ఈ నేప‌థ్యంలో అదే వేదికపై వెంటనే ప్రపంచ క‌ప్ నిర్వహించ‌డం సాధ్యమా అన్న కోణంలో బీసీసీఐ సమాలోచ‌న‌లు జరుపుతున్నట్లు తెలుస్తుంది. యూఏఈలో షార్జా, దుబాయ్‌, అబుదాబి నగరాల్లో మాత్రమే స్టేడియాలు ఉన్నాయ‌ని, కానీ శ్రీలంకలో తక్కువ పరిధిలో చాలా అంతర్జాతీయ స్థాయి వేదికలున్నాయని లంక క్రికెట్‌ బోర్డ్‌ బీసీసీఐకి నివేదించినట్లు సమాచారం. అలాగే సెప్టెంబ‌ర్‌ నెలలో మెగా టోర్నీ నిర్వహించేందుకు శ్రీలంకలో అనువైన వాతావరణం ఉంటుందని ఆ దేశ క్రికెట్‌ బోర్డ్‌ వివరించింది. కాగా, ఐపీఎల్ నిర్వహ‌ణ‌కు కూడా తాము సిద్ధమేనంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు ఇటీవల ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచక‌ప్‌ను భారత్‌లో కాకుండా బ‌య‌ట నిర్వహించాల్సివస్తే, ప‌న్ను మిన‌హాయింపు కోసం ఆయా దేశాలు ఐసీసీని సంప్రదించాల్సి ఉంటుందని, ఇందుకోసం జూన్ 15వ తేదీలోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, అలాగే టోర్నీ నిర్వహణపై తుది నివేదికను జూన్ 28వ తేదీలోగా చెప్పాల్సి ఉంటుంద‌ని ఐసీసీ ప్రతినిధి తెలిపారు. మరోవైపు ప్రపంచక‌ప్ ఎక్కడ జరిగినా, హోస్టింగ్ రైట్స్ మాత్రం బీసీసీఐ వ‌ద్దే ఉంటాయ‌ని ఐసీసీ మరోసారి స్పష్టం చేసింది.
చదవండి: సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ పునఃప్రారంభం
 

మరిన్ని వార్తలు