భారత్‌తో సిరీస్‌.. లంక క్రికెట్‌ బోర్డ్‌పై కనక వర్షం, ఏంతో తెలిస్తే షాకవ్వాల్సిందే

12 Aug, 2021 14:30 IST|Sakshi

కొలంబో: టీమిండియాతో సిరీస్ ఆడేందుకు ప్ర‌పంచంలోని ఏ క్రికెట్‌ బోర్డ‌యినా ఆసక్తి కనబరుస్తుంది. ఎందుకంటే, మ‌న జట్టుతో ఆడితే ప్రత్యర్ధి దేశాల బోర్డులపై కనక వ‌ర్షం కురుస్తుంది మ‌రి. తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు.. బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుని స్వదేశంలో ద్వైపాక్షిక సిరీస్‌ను ప్లాన్‌ చేసింది. ఈ సిరీస్‌ నష్టాల్లో కూరుకుపోయిన లంక బోర్డుపై కాసుల వర్షం కురిపించింది. ఆటగాళ్లకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న బోర్డుకు వంద కోట్లకుపైగా ఆదాయాన్ని సమకూర్చింది. లంక బోర్డు సెక్ర‌ట‌రీ మోహ‌న్ డిసిల్వా కథనం ప్ర‌కారం.. ఈ సిరీస్‌ ద్వారా లంక బోర్డుకు రూ.107.7 కోట్లు వ‌చ్చాయని తెలుస్తోంది. 

నిజానికి ఈ పర్యటనలో తొలుత మూడు వ‌న్డేల సిరీస్ మాత్ర‌మే జ‌ర‌గాల్సి ఉండింది. అయితే అక్క‌డి బోర్డు బీసీసీఐని అభ్య‌ర్థించి మ‌రో మూడు టీ20ల సిరీస్ ఆడ‌టానికి ఒప్పించింది. ఇది ఆర్థికంగా అక్క‌డి బోర్డుకు బాగా క‌లిసి వ‌చ్చింది. బ్రాడ్‌కాస్టింగ్‌, ఇత‌ర స్పాన్స‌ర్‌షిప్స్‌ల ద్వారా భారీ మొత్తం దక్కించుకోగలిగింది. కాగా, ఈ సిరీస్ కోసం వ‌చ్చి, విజ‌య‌వంతం చేసిన కోచ్ ద్ర‌విడ్‌, ధవన్‌ సేనకు లంక బోర్డు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఈ టూర్‌లో వ‌న్డే సిరీస్ టీమిండియా గెల‌వ‌గా.. టీ20 సిరీస్‌ను శ్రీలంక గెలిచిన విష‌యం తెలిసిందే.

మరిన్ని వార్తలు