సొంత జట్టుకు వ్యతిరేకంగా లంక అభిమానుల ప్రచారం..

27 Jun, 2021 22:20 IST|Sakshi

కొలొంబో: ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దారుణంగా విఫలమై 0-3తేడాతో సిరీస్‌ను కోల్పోయిన శ్రీలంక జట్టుపై ఆ దేశ అభిమానులు వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నారు. సౌతాంప్టన్‌ వేదికగా శనివారం జరిగిన చివరి మ్యాచ్‌లో లంక జట్టు 89 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన నేపథ్యంలో అ దేశ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా తమ జట్టును టార్గెట్‌ చేశారు. వరుస ఓటములతో విసిగిపోయిన వారు తమ జట్టు ఆటగాళ్లకు వ్యతిరేకంగా (#unfollowcricketers) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రచారం ప్రారంభించారు. ఫేస్‌బుక్‌లో శనివారం నుంచి ఇది విపరీతంగా ట్రెండ్ అవుతుంది. శ్రీలంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్, ఓపెనర్ ధనుష్క గుణతిలక ఫేస్‌బుక్ పేజీలను వేలాదిమంది అభిమానులు బాయ్‌కాట్ చేశారు.

శ్రీలంక ఆడే మ్యాచ్‌లను టీవీలలో వీక్షించవద్దంటూ అభిమానులు మీమ్స్ షేర్ చేసుకున్నారు. గత 30 ఏళ్లలో శ్రీలంక ఇంత చెత్తగా ఎప్పుడూ ఆడలేదని అభిమానులు మండిపడుతున్నారు. లంక క్రికెటర్ల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌ ఖాతాలను అన్‌ఫాలో చేయడమే లక్ష్యంగా ఈ ప్రచారం సాగింది. ప్రస్తుతం నెట్టింట ఈ విషయం వైరల్‌గా మారింది.కాగా, సోషల్ మీడియాలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఈ ప్రచారంపై లంక బోర్డు సభ్యులు ఎవరూ స్పందించకపోవడం విశేషం. శ్రీలంక మాజీ కెప్టెన్‌ సనత్‌ జయసూర్య ఒక్కడు ఈ విషయమై మాట్లాడాడు. లంక క్రికెట్‌ జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉందని, వెంటనే తగు చర్యలు తీసుకొని దేశంలో క్రికెట్‌ను కాపాడాలని బోర్డు సభ్యులను అభ్యర్ధించాడు.

ఇదిలా ఉంటే, టీ20ల్లో శ్రీలంకకు ఇది వరుసగా ఐదో సిరీస్ ఓటమి. అంతకుముందు కూడా లంక జట్టు భారీ ఓటములను మూటగట్టుకుంది. ఒక్క సిరీస్‌లో కూడా కనీస పోటీ ఇవ్వలేకపోయింది. అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమవుతూ వస్తుంది. కాగా, శనివారం రాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో 181 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ 89 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, పరుగుల తేడా పరంగా నాలుగో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు తొలి టీ20లో 129/7 స్కోర్‌ చేసిన లంక.. రెండో టీ20లో 111/7, మూడో మ్యాచ్‌లో 91 పరుగులకు ఆలౌటైంది. లంక దారుణ ప్రదర్శనను సొంత అభిమానులే జీర్ణించుకోలేకపోతున్నారు.
చదవండి: మాట మార్చిన ద్రవిడ్‌.. అప్పుడు అందరికీ అవకాశం అన్నాడు, ఇప్పుడేమో..!

>
మరిన్ని వార్తలు