Asia Cup 2022: 'ఆసియా కప్‌ నిర్వహించలేం.. వేదికను మార్చండి'

29 May, 2022 19:59 IST|Sakshi

శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. నిత్యావసరాల ధరలు మండిపోతుండగా.. పెట్రోల్‌ ధర ఆకాశాన్ని అంటింది. తీవ్ర సంక్షోభంతో అక్కడి జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో లంక క్రికెట్‌ బోర్డు ఆసియా కప్‌ నిర్వహించలేమంటూ చేతులెత్తేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు శ్రీలంకలో ఆసియా కప్‌ జరగాల్సి ఉంది.

అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృశ్యా ఆసియా కప్‌ను నిర్వహించలేమని.. వేదికను మార్చాలంటూ ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఏసీసీ)కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏసీసీ అధ్యక్షుడు జై షాకు లంక క్రికెట్‌ బోర్డు వినతిపత్రం సమర్పించింది. కాగా జై షా సహా బీసీసీఐ అధికారులతో పాటు లంక క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఉన్నారు. ఇవాళ(మే 29) ఐపీఎల్‌ ఫైనల్‌ జరగనుండడంతో మ్యాచ్‌ వీక్షించేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్‌లో జై షా నేతృత్వంలో ఆసియా కప్‌ నిర్వహణకు సంబంధించిన మీటింగ్‌ ఏర్పాటు చేశారు.

లంకలో ఆసియా కప్‌ నిర్వహణ కష్టమని ఆ దేశ బోర్డు వివరించగా.. అందుకు మెజారిటీ ఏసీసీ సభ్యులు పాజిటివ్‌గా స్పందించారు. అయితే ఐపీఎల్‌ ఫైనల్‌ ముగిసిన తర్వాతే ఆసియా కప్‌ ఎక్కడ నిర్వహించాలనే దానిపై స్పష్టత రానుంది. ముందుగా అనుకున్న ప్రకారం శ్రీలంకలో ఆసియా కప్‌ నిర్వహణ కష్టమైతే యూఏఈకి తరలించడమో లేక బంగ్లాదేశ్‌ వేదికగా టోర్నీని నిర్వహించాలని ఏసీసీ భావించింది.

ఇదే నిజమైతే ఆసియా కప్‌ యూఏఈ లేదా బంగ్లాదేశ్‌లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ టోర్నీలో భారత్‌ సహా పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్గానిస్తాన్‌, యూఏఈలు తలపడనున్నాయి. టి20 ఫార్మాట్‌లో టోర్నీని నిర్వహించనున్నారు.  ఆసియా కప్‌ చివరిసారి 2018లో యూఏఈలో జరగ్గా.. ఫైనల్లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన టీమిండియా ఏడోసారి కప్‌ను కైవసం చేసుకుంది.

చదవండి: కాల్పుల కలకలం.. పరుగులు పెట్టిన ప్రేక్షకులు; ఊహించని ట్విస్ట్‌

మరిన్ని వార్తలు