రూట్‌ డబుల్‌ సెంచరీ

17 Jan, 2021 06:18 IST|Sakshi

ఇంగ్లండ్‌కు 286 పరుగుల ఆధిక్యం

శ్రీలంక 156/2

గాలె (శ్రీలంక): శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌ జట్టుకు 286 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 320/4తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ 421 పరుగుల భారీ స్కోరును సాధించింది. కెప్టెన్‌ జో రూట్‌ (321 బంతుల్లో 228; 18 ఫోర్లు, 1 సిక్స్‌) టెస్టుల్లో నాలుగో డబుల్‌ సెంచరీతో సత్తా చాటాడు. అంతేకాకుండా ఈ మైదానంలో ద్విశతకాన్ని సాధించిన నాలుగో విదేశీ ప్లేయర్‌గా ఘనత వహించాడు. అతని కన్నా ముందు క్రిస్‌ గేల్‌ (333; వెస్టిండీస్‌), వీరేంద్ర సెహ్వాగ్‌ (201 నాటౌట్‌; భారత్‌), ముష్ఫికర్‌ రహీమ్‌ (200; బంగ్లాదేశ్‌) ఇదే మైదానంలో డబుల్‌ సెంచరీలు బాదారు. శనివారం ఆటలో లంక బౌలర్లు దిల్‌రువాన్‌ పెరీరా (4/109), ఆషిత ఫెర్నాండో (2/44) రాణించడంతో ఇంగ్లండ్‌ లంచ్‌ సమయానికే మిగిలిన 6 వికెట్లు కోల్పోయి 101 పరుగులు జోడించగలిగింది.

ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ రూట్‌ 291 బంతుల్లో ద్విశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. బట్లర్‌ (30; 3 ఫోర్లు) రాణించాడు. లసిత్‌ ఎంబుల్‌డేనియాకు 3 వికెట్లు దక్కాయి. 286 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక శనివారం ఆట ముగిసే సమయానికి 61 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు లంక ఇంకా 130 పరుగులు వెనుకబడి ఉంది. లంకకు ఓపెనర్లు కుశాల్‌ పెరీరా (62; 5 ఫోర్లు, 1 సిక్స్‌), లహిరు తిరిమన్నె (76 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 101 పరుగుల్ని జోడించారు. కుశాల్‌ మెండిస్‌ (15) ఔటైనా... తిరిమన్నెతో కలిసి లసిత్‌ ఎంబుల్‌డేనియా (0 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్యామ్‌ కరన్, జాక్‌ లీచ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

మరిన్ని వార్తలు