Ind Vs Sl: వరుస ఓటములు.. శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ

22 Jul, 2021 16:40 IST|Sakshi

కొలంబో: టీమిండియా చేతిలో వరుసగా రెండు వన్డేల్లో ఓటమి పొంది.. సిరీస్‌ని చేజార్చుకున్న శ్రీలంకకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కొలంబో వేదికగా మంగళవారం జరిగిన  రెండో వన్డేలో  స్లో ఓవర్ రేట్ కారణంగా శ్రీలంక జట్టుకు జరిమానా విధించారు. ఈ మేరకు మ్యాచ్ రిఫరీ రంజన్.. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టీమ్ నిర్దిష్ట సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసింది. అయితే  శ్రీలంక  కెప్టెన్ దసున్ షనక తప్పిదాన్ని  అంగీకరించడంతో ఎలాంటి తదుపరి విచారణ లేకుండా మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు.

ఇక ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ నిబంధనల ప్రకారం నిర్థిష్ట సమయానికన్నా తక్కువగా ఓవర్లు వేస్తే ఒక్కో ఓవర్ చొప్పున ఒక్కో పాయింట్ కోత విధిస్తారు. ఈ నేపథ్యంలో.. ఒక్క ఓవర్ తక్కువగా వేసిన శ్రీలంక ఓ పాయింట్‌ను కోల్పోయింది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచేలా కనిపించిన శ్రీలంక టీమ్.. టీమిండియా ఆటగాడు దీపక్ చహర్ (69) దెబ్బకి అనూహ్యరీతిలో 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. కాగా భారత్, శ్రీలంక మధ్య కొలంబో వేదికగానే శుక్రవారం మూడో వన్డే జరగనుంది.


 

మరిన్ని వార్తలు