Pak Vs SL 1st Test: ఏమని వర్ణించగలం?.. బాబర్‌ ఆజంకే దిమ్మ తిరిగింది 

19 Jul, 2022 18:50 IST|Sakshi

యాసిర్‌ షా ''బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ''తో కుషాల్‌ మెండిస్‌ను ఔట్‌ చేసిన ఒక్కరోజు వ్యవధిలోనే మరో అద్భుతం చోటుచేసుకుంది. శ్రీలంక బౌలర్‌ ప్రభాత్‌ జయసూర్య పాకిస్తాన్‌ కెప్టెన్‌.. ఇన్‌ఫాం బ్యాటర్‌ బాబర్‌ ఆజంను ఔట్‌ చేసిన విధానం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. క్రీజులో ఉన్న బాబర్‌ ఆజం తాను ఔటయ్యానా అన్న సందేహం కలిగేలా చేసింది ఆ బంతి. బాబర్‌ ఆజంకే దిమ్మ తిరిగేలా చేసిన ఆ బంతిని ఏమని వర్ణించగలం. 

విషయంలోకి వెళితే.. లంకతో తొలి టెస్టులో 342 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాకిస్తాన్‌ను షఫీక్‌ అబ్దుల్లా, బాబర్‌ ఆజం తమ ఇన్నింగ్స్‌తో నిలబెట్టారు. అటు షఫీక్‌ సెంచరీతో ఆకట్టుకోగా.. బాబర్‌ ఆజం కూడా అర్థ సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరి జోడిని విడదీయడానికి లంక బౌలర్లు తెగ కష్టపడినా లాభం లేకపోయింది. ఇద్దరి భాగస్వామ్యం బలపడుతున్న దశలో బౌలింగ్‌కు వచ్చాడు ప్రభాత్‌ జయసూర్య. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన ప్రభాత్‌ రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి మెరిశాడు. అసలే సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన బాబర్‌ ఆజం క్రీజులో ఉన్నాడు. దీనికి తోడూ తొలి ఇన్నింగ్స్‌లో వీరోచిత సెంచరీతో లంకకు కేవలం నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కేలా చేశాడు.

లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అయిన ప్రభాత్‌ జయసూర్య ఓవర్‌ ది వికెట్‌ మీదుగా బౌలింగ్‌ చేశాడు. పూర్తిగా లెగ్‌స్టంప్‌ అవతల పడిన బంతిని బాబర్‌ అంచనా వేయడంలో పొరబడ్డాడు. లెగ్‌ స్టంప్‌ మీదుగా పడిన బంతి ఆఫ్‌స్టంప్‌ మీదుగా వస్తుందని భ్రమ పడిన బాబర్‌ ప్యాడ్లను అడ్డుపెట్టాడు. ఇక్కడే ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది. లెగ్‌స్టంప్‌ అవతల పడిన బంతి బాబర్‌ కాళ్ల వెనకాల నుంచి టర్న్‌ తీసుకొని నేరుగా లెగ్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. దీనిని క్రికెట్‌ భాషలో ''జప్ఫా బంతి'' అని పిలుస్తారు. అంతే లంక బౌలర్‌ జయసూర్య కళ్లలో ఆనందం కనబడగా.. బాబర్‌ మాత్రం ఏం జరిగిందో అర్థంగాక చూస్తూ నిల్చుండిపోయాడు. ఆ తర్వాత జయసూర్య బౌలింగ్‌ను మెచ్చుకుంటూ పెవిలియన్‌ చేరాడు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్‌ 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్‌ 112, మహ్మద్‌ రిజ్వాన్‌ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్‌ విజయానికి 120 పరుగులు అవసరం కాగా.. లంకకు ఏడు వికెట్లు అవసరం. మరొక రోజు ఆట మిగిలి ఉండడంతో లంక బౌలర్లు మ్యాజిక్‌ చేస్తారా.. లేక ప్యాక్‌ బ్యాటర్లకు దాసోహం అంటారా అనేది వేచి చూడాలి.

చదవండి: యాసిర్‌ షా 'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ'... దిగ్గజ బౌలర్‌ గుర్తురాక మానడు

మరిన్ని వార్తలు