IND vs SL: లంకేయుల్లో మరొకరికి.. భారత్‌తో సిరీస్‌ ఇక డౌటే..!

9 Jul, 2021 17:24 IST|Sakshi

కొలంబో: భారత్‌, శ్రీలంకల మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్‌ సందిగ్ధంలో పడింది. శ్రీలంక బృందంలో వరుసగా కరోనా కేసులు బయటపడుతుండడమే ఇందుకు కారణం. తొలుత శ్రీలంక బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్‌ కరోనా బారిన పడగా, తాజాగా ఆ జట్టు డేటా అనలిస్ట్‌ జీటీ నిరోషనన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని లంక క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది. శ్రీలంక బృందం మొత్తానికి నిన్న ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా, నిరోషనన్‌కు పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉన్నారు. 

కాగా, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీసు కోసం లంకేయులు కొన్ని రోజుల క్రితం ఇంగ్లండ్‌లో పర్యటించారు. ఈ సిరీస్‌లో భాగస్తులైన ముగ్గురు ఇంగ్లండ్‌ క్రికెటర్లు, నలుగురు సహాయ సిబ్బంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో లంకేయులకు స్వదేశానికి రాగానే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. తొలుత గ్రాంట్‌ ఫ్లవర్‌కు పాజిటివ్‌ రావడంతో ఆయనను ఐసోలేషన్‌కు తరలించారు. తాజాగా రెండో వ్యక్తికి వైరస్‌ సోకిందని తేలడంతో లంక బృందంలోని సభ్యులు ఉలిక్కిపడ్డారు. ఇదిలా ఉంటే, జులై 13 నుంచి లంక జట్టు టీమిండియాతో వన్డే సిరీస్‌లో తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. 

మరిన్ని వార్తలు