13 ఏళ్ల తర్వాత... భారత్‌పై సిరీస్‌ నెగ్గిన శ్రీలంక

30 Jul, 2021 01:14 IST|Sakshi

చివరి టి20 మ్యాచ్‌లో ఏడు వికెట్లతో విజయం

కొలంబో: టీమిండియాకు యువ శ్రీలంక టీమ్‌ షాకిచ్చింది. సిరీస్‌ విజేతను తేల్చే చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో హసరంగ (4/9) తన స్పిన్‌ మాయాజాలంతో భారత్‌ను కట్టడి చేశాడు. దాంతో శ్రీలంక ఏడు వికెట్లతో ఘనవిజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. ఈ ఫార్మాట్‌లో ఎనిమిది వరుస సిరీస్‌ విజయాలతో దూసుకెళ్తున్న భారత్‌కు శ్రీలంక రూపంలో బ్రేక్‌ పడింది. శ్రీలంకకు ఐదు వరుస టి20 సిరీస్‌ పరాజయాల తర్వాత దక్కిన తొలి సిరీస్‌ ఇదే కావడం విశేషం. అంతేకాకుండా 2008 తర్వాత భారత్‌పై ద్వైపాక్షిక సిరీస్‌లో విజేతగా నిలువడం శ్రీలంకకు ఇదే తొలిసారి.

గురువారం జరిగిన పోరులో తొలుత భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 81 పరుగులు మాత్రమే చేసింది. టి20ల్లో భారత్‌కిది మూడో అత్యల్ప స్కోరు. బౌలర్లు కుల్దీప్‌ యాదవ్‌ (28 బంతుల్లో 23 నాటౌట్‌), భువనేశ్వర్‌ (32 బంతుల్లో 16) పోరాడటంతో భారత్‌ ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. బౌలింగ్‌లో హసరంగకు కెప్టెన్‌ దసున్‌ షనక (2/20) కూడా తోడవ్వడంతో భారత్‌ కోలుకోలేదు. స్వల్ప లక్ష్యఛేదనలో శ్రీలంక 14.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 82 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వా (20 బంతుల్లో 23 నాటౌట్‌; 2 ఫోర్లు), హసరంగ (9 బంతుల్లో 14 నాటౌట్‌; 1 ఫోర్‌) జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన హసరంగ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులను అందుకున్నాడు. 

చేతులెత్తేసిన బ్యాట్స్‌మెన్‌ 
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ ఏ దశలోనూ కుదురుగా ఆడలేదు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (0)ను చమీర అవుట్‌ చేశాడు. ఫోర్‌ కొట్టి టచ్‌లో కనిపించిన దేవ్‌దత్‌ (9; 1 ఫోర్‌)ను రమేశ్‌ మెండిస్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక బౌలింగ్‌కు వచ్చిన హసరంగ ఒకే ఓవర్లో రుతురాజ్‌ (14; 2 ఫోర్లు), సంజూ సామ్సన్‌ (0)లను అవుట్‌ చేయడంతో భారత్‌ కోలుకోలేదు. భువనేశ్వర్, కుల్దీప్‌ కాసేపు ప్రతిఘటించడంతో భారత్‌ టి20లో తన అత్యల్ప స్కోరు (74)ను దాటగలిగింది. మరోసారి బౌలింగ్‌కు వచ్చిన హసరంగ... భువనేశ్వర్‌తో పాటు వరుణ్‌ చక్రవర్తి (0)లను అవుట్‌ చేశాడు. 

రాహుల్‌ తిప్పేసినా....  
ఛేదనలో శ్రీలంకను రాహుల్‌ చహర్‌ కాసేపు భయపెట్టాడు. పిచ్‌ స్పిన్‌కు సహకరిస్తుండటంతో రాహుల్‌... అవిష్క ఫెర్నాండో (12; 1 ఫోర్‌), మినోద్‌ భానుక (18; 1 ఫోర్‌), సమరవిక్రమ (6) వికెట్లను తీసి లంకేయుల శిబిరంలో గుబులు రేపాడు. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో క్రీజులో ఉన్న ధనంజయ డిసిల్వా, హసరంగ అజేయమైన నాలుగో వికెట్‌కు 26 పరుగుల జోడించి శ్రీలంకను గెలిపించారు. 

స్కోరు వివరాలు భారత్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌  (ఎల్బీ) (బి) హసరంగ 14; ధావన్‌ (సి) ధనంజయ (బి) చమీర 0; పడిక్కల్‌ (ఎల్బీ) (బి) మెండిస్‌ 9; సామ్సన్‌ (ఎల్బీ) (బి) హసరంగ 0; నితీశ్‌ రాణా (సి అండ్‌ బి) షనక 6; భువనేశ్వర్‌ (సి) షనక (బి) హసరంగ 16; కుల్దీప్‌ (నాటౌట్‌) 23; రాహుల్‌ చహర్‌ (సి) భానుక (బి) షనక 5; వరుణ్‌ చక్రవర్తి (సి) కరుణరత్నే (బి) హసరంగ 0; సకారియా (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 81. వికెట్ల పతనం: 1–5, 2–23, 3–24, 4–25, 5–36, 6–55, 7–62, 8–63. బౌలింగ్‌: చమీర 4–0–16–1; కరుణరత్నే 2–0–12–0; రమేశ్‌ మెండిస్‌ 2–0–13–1; హసరంగ 4–0–9–4; అకిల 4–0–11–0; షనక 4–0–20–0. 

శ్రీలంక ఇన్నింగ్స్‌: అవిష్క (సి అండ్‌ బి) రాహుల్‌ చహర్‌ 12; మినోద్‌ (ఎల్బీ) (బి) రాహుల్‌ చహర్‌ 18; సమరవిక్రమ (బి) రాహుల్‌ చహర్‌ 6; ధనంజయ డిసిల్వా (నాటౌట్‌) 23; హసరంగ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (14.3 ఓవర్లలో 3 వికెట్లకు) 82. వికెట్ల పతనం: 1–23, 2–35, 3–56. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2–0–9–0; వరుణ్‌ చక్రవర్తి 3.3–0–15–0; సందీప్‌ 3–0–23–0; చహర్‌ 4–0–15–3; కుల్దీప్‌ 2–0–16–0.   

మరిన్ని వార్తలు