Danushka Gunathilaka Retirement: శ్రీలంక జట్టుకు మరో షాక్‌.. గుడ్‌ బై చెప్పిన గుణతిలక!

7 Jan, 2022 18:46 IST|Sakshi

శ్రీలంక క్రికెట్‌ జట్టుకు మరో షాక్‌ తగిలింది. ఆ జట్టు ఆటగాడు ధనుష్క గుణతిలక టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సంప్రదాయ ఫార్మాట్‌కు గుడ్‌ బై చెప్పాడు. ఈ మేరకు తన రిటైర్మెంట్‌ లేఖను శ్రీలంక​ క్రికెట్‌ బోర్డుకు సమర్పించినట్లు న్యూస్‌వైర్‌ వెల్లడించింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఎక్కువగా దృష్టి సారించేందుకే తాను నిర్ణయం తీసుకున్నట్లు 30 ఏళ్ల ధనుష్క తన లేఖలో పేర్కొన్నట్లు తెలిపింది. 

కాగా గుణతిలక రెండేళ్ల క్రితం శ్రీలంక తరఫున చివరిసారిగా టెస్టు క్రికెట్‌ ఆడాడు. మొత్తంగా 8 టెస్టుల్లో భాగమయ్యాడు. ఇక గతేడాది ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా బయో బబుల్‌(కోవిడ్‌) నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ.. గుణతిలక నిషేధం ఎదుర్కొంటున్నాడు. ఇదిలా ఉండగా శ్రీలంక బోర్డు ఇటీవల ఫిట్‌నెస్‌కు సంబంధించి నూతన మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటి ప్రకారం.. ప్రతి ఆటగాడు 8.10 నిమిషాల్లో రెండు కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంటుంది. 

ఒకవేళ నిర్ధిష్ట సమయంలో పరుగు పూర్తి కాకపోతే వేతనాల్లో కోత పెట్టేందుకు నిర్ణయించారు. ఈ నిబంధనల నేపథ్యంలో స్టార్‌ ప్లేయర్‌ భనుక రాజపక్స అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇప్పుడు గుణతిలక సైతం టెస్టులకు మాత్రమే గుడ్‌ బై చెప్పినప్పటికీ.. నిషేధం తొలగిన తర్వాత ఫిట్‌నెస్‌ పరీక్షలో నెగ్గితేనే జట్టులో చోటు దక్కించుకోగలడు. ఏదేమైనా వారాల వ్యవధిలో లంక క్రికెట్‌ జట్టులో యువ ఆటగాళ్లు రిటైర్మెంట్‌ ప్రకటించడం చర్చనీయాంశమైంది.

చదవండి: Ind Vs Sa 2nd Test: నువ్వు తోపు అనుకోకు.. అలా చేశావో నిన్ను మించినోడు లేడని చెప్పాను.. అంతే.. ఇక ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలే!

మరిన్ని వార్తలు