దారి మళ్లిన లంకేయుల విమానం.. భారత్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

7 Jul, 2021 19:03 IST|Sakshi

న్యూఢిల్లీ: శ్రీలంక క్రికెట్‌ జట్టు ప్రయానిస్తున్న ప్రత్యేక విమానం భారత్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ ముగించుకుని స్వదేశానికి బయల్దేరిన లంక జట్టు.. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వారు ప్రయానిస్తున్న విమానాన్ని ఇంధన సమస్య తలెత్తడంతో హఠాత్తుగా భారత్‌లో దించాల్సి వచ్చింది. దీంతో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ఆందోళన చెందారు. ఈ విషయాన్ని ఆ జట్టు కోచ్‌ మైక్‌ ఆర్థర్‌ వెల్లడించారు. విమానం భారత్‌లో ల్యాండ్‌ కాగానే ఫోన్‌ ఆన్‌ చేశానని,  ఇంగ్లండ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ వేన్‌ బెంట్లీ నుంచి తనకు కొన్ని సందేశాలు వచ్చాయని, పరిస్థితి గురించి అతను అందులో వివరించాడని మైక్‌ పేర్కొన్నారు. 

కాగా, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీసు కోసం ఇంగ్లండ్‌లో పర్యటించిన లంక జట్టు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఓటమి పాలై ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. టీ20 సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న ఆతిధ్య ఇంగ్లండ్‌ జట్టు, వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుని లంక జట్టును క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ సిరీస్‌ ముగిసిన అనంతరం లంక జట్టు స్వదేశానికి బయల్దేరింది. ఈ క్రమంలోనే వారు ప్రయానిస్తున్న విమానం అనూహ్యంగా భారత్‌లో ల్యాండైంది. 

ఇదిలా ఉంటే, ఈ నెల 13 నుంచి భారత్‌, శ్రీలంక జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌ జరగాల్సి ఉంది. ఇటీవల ఇంగ్లండ్‌ క్రికెటర్లు కరోనా బారిన పడటంతో, లంక క్రికెటర్లు కూడా ఐసోలేషన్‌లోని వెళ్లాల్సి వస్తుంది. దీంతో భారత్‌తో సిరీస్‌ షెడ్యూల్‌ మారే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. ఇరు జట్ల మధ్య తొలి వన్డే జులై 13న  జరుగనుండగా..జులై 16న రెండో వన్డే, 18న మూడో వన్డే‌ జరుగనుంది. అనంతరం జులై 21న తొలి టీ20.. జులై 23, 25న మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.

భారత జట్టు: శిఖర్‌ ధవన్‌ (కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్ (వైస్‌ కెప్టెన్‌), పృథ్వీ షా, దేవదత్‌ పడిక్కల్‌, హార్దిక్ పాండ్యా, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్, మనీష్‌ పాండే, నితీష్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌, సంజు శాంసన్‌, యుజ్వేంద్ర చహల్‌, రాహుల్‌ చాహర్‌, కృష్ణప్ప గౌతమ్‌, కృనాల్‌ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, దీపక్‌ చహర్‌, నవ్‌దీప్‌ సైనీ, చేతన్‌ సకారియా. 
 

మరిన్ని వార్తలు