T20 WC 2022: ఆసియా కప్‌, టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలకు బంగ్లాదేశ్‌ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్‌!

19 Aug, 2022 16:28 IST|Sakshi

Asia Cup 2022- T20 World Cup 2022: ఆసియా కప్‌-2022, టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీల నేపథ్యంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా ఈవెంట్ల కోసం టీమిండియా మాజీ క్రికెటర్‌ శ్రీధరన్‌ శ్రీరామ్‌ను కోచ్‌గా నియమించినట్లు సమాచారం. ఈ విషయాన్ని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు డైరెక్టర్‌ వెల్లడించినట్లు ది డైలీ స్టార్‌ తన కథనంలో పేర్కొంది. ‘‘అవును.. ప్రపంచకప్‌ ఈవెంట్‌ వరకు మేము శ్రీరామ్‌తో కలిసి పనిచేయబోతున్నాం.

ఆసియా కప్‌ నుంచి సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. మా ప్రధాన లక్ష్యం టీ20 ప్రపంచకప్‌. నిజానికి... వరల్డ్‌కప్‌ టోర్నీ సమయంలో ఈ నియామకం జరిగినట్లయితే.. అప్పటికప్పుడు పరిస్థితులను అర్థం చేసుకుని జట్టుతో మమేకమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి.. ఆసియా కప్‌ ఈవెంట్‌ నుంచే జట్టుతో కలిసేలా ప్రణాళికలు వేశాం’’ అని సదరు అధికారి పేర్కొన్నట్లు డైలీ స్టార్‌ తెలిపింది.

మరి పాత కోచ్‌?
అదే విధంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు శ్రీరామ్‌ నియామకం నేపథ్యంలో ప్రస్తుత కోచ్‌ రసెల్‌ డొమింగో బంగ్లాదేశ్‌ టెస్టు జట్టుకు మార్గదర్శనం చేస్తాడని తెలిపినట్లు పేర్కొంది. కాగా చెన్నైకి చెందిన శ్రీధరన్‌ శ్రీరామ్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా ఎదిగాడు. 2000- 2004 మధ్య కాలంలో టీమిండియా తరఫున ఎనిమిది వన్డేలు ఆడిన అతడు కోచింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు.

ఆసీస్‌ను విజేతగా నిలపడంలో!
ఈ క్రమంలో ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్‌ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించి.. అష్టన్‌ అగర్‌, ఆడం జంపా వంటి యువకులకు స్పిన్‌ బౌలింగ్‌లో మెళకువలు నేర్పించాడు. టీ20 ప్రపంచకప్‌-2021 గెలిచిన ఆసీస్‌ జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా పనిచేశాడు. అదేవిధంగా ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు కోచింగ్‌ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు. గతంలో పంజాబ్‌ బౌలింగ్‌ కోచ్‌గానూ శ్రీధరన్‌ శ్రీరామ్‌ పనిచేశాడు.

ఘోర పరాభవం!
కాగా ఇటీవల బంగ్లాదేశ్‌.. జింబాబ్వే చేతిలో ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. జింబాబ్వేలో పర్యటించి వన్డే, టీ20 సిరీస్‌లను 2-1 తేడాతో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. ఆసియా కప్‌-2022కు ముందుకు ఇలాంటి పరాభవం ఎదురైన నేపథ్యంలో బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కోచ్‌గా శ్రీధరన్‌ శ్రీరామ్‌ నియామకం జరిగినట్లు సమాచారం. 

చదవండి: Ind Vs Zim: అతడిని ముట్టుకున్నా.. జింబాబ్వే యువతి సంతోషం! ఫిదా చేసిన భారత క్రికెటర్‌!
LLC 2022: గంభీర్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ బ్యాట్‌ పట్టనున్న గౌతీ!

మరిన్ని వార్తలు