సాఫ్ట్‌బాల్‌లో సిక్కోలు ఆశాకిరణం

15 Jul, 2022 14:27 IST|Sakshi

జాతీయ స్థాయిలో రాణిస్తున్న అంపోలు రమణమూర్తి

ఎన్‌ఐఎస్‌ పూర్తి, జాతీయ స్థాయి పోటీలకు రిఫరీగా కూడా అర్హత

జాతీయ జట్టుకు ఆడటమే లక్ష్యంగా అడుగులు  

దారంతా కష్టాలు కనిపించాయి. చెమట్లు చిందించాడు. అడుగడుగునా అవరోధాలు ఎదురయ్యాయి. అంతులేని పట్టుదల ప్రదర్శించాడు. పేదరికం పెద్ద అడ్డుగోడలా నిలిచింది. ప్రతిభను నమ్ముకుని ముందుకు కదిలాడు. ఆ కష్టాలు ఇప్పుడతనికి అనుభవాలయ్యాయి. అవరోధాలు మైలురాళ్లుగా మారాయి. పేదరికం తన గమ్యాన్ని గుర్తు చేసే సాధనమైంది. సాఫ్ట్‌బాల్‌లో సిక్కోలు ఆశాకిరణమై కనిపిస్తున్న రమణమూర్తి క్రీడా ప్రయాణం ఆసాంతం ఆదర్శ ప్రాయం. ఇప్పటికే జాతీయ పోటీలకు రిఫరీగా ఎంపికైన ఈ డిగ్రీ కుర్రాడు జాతీయ జట్టుకు ఆడడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు.  


శ్రీకాకుళం న్యూకాలనీ:
కఠోర శ్రమ, సాధన, పట్టుదలకు ప్రతిభ తోడయితే ఎలా ఉంటుందో నిరూపిస్తున్నాడు అంపోలు రమణమూర్తి. సాఫ్ట్‌బాల్‌లో జాతీయస్థాయిలో రాణిస్తున్నాడు. ఇదే సమయంలో జాతీయ స్థాయి లో నిర్వహించే పోటీలకు టెక్నికల్‌ అఫీషియల్‌గా కూడా అర్హత సాధించడం విశేషం. ఆమదాలవలస మండల పరిధిలోని కొత్తవలస గ్రామానికి అంపోలు రమణమూర్తి తల్లిదండ్రులు సత్యనారాయణ, కృష్ణవేణి. రమణమూర్తికి అక్క రాజేశ్వరి కూడా ఉంది.


రమణమూర్తి తల్లిదండ్రులిద్దరూ దినసరి కూలీలే. 2010–11లో జెడ్పీహెచ్‌ స్కూల్‌ తొగరాం(ఆమదాలవలస మండలం)లో 6వ తరగతి చదువుతున్న సమయంలో రమణమూర్తిలో ఉన్న ప్రతిభను అక్కడి ఫిజికల్‌ డైరెక్టర్, సాఫ్ట్‌బాల్‌ సంఘ జిల్లా ముఖ్య ప్రతినిధి మొజ్జాడ వెంకటరమణ గుర్తించారు. అలాగే పీడీ ఎంవీ రమణ అతడిని ఉన్నతంగా తీర్చిదిద్దారు. జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబర్చిన రమణమూర్తి రాష్ట్రపోటీలకు ఎంపికయ్యాడు. స్లగ్గింగ్‌తోపాటు ఆల్‌ రౌండర్‌గా గుర్తింపు పొందాడు.


2012లో మాచర్లలో తాను ప్రాతినిధ్యం వహించిన తొలి రాష్ట్ర పోటీలోనే సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. అక్కడ నుంచి వెనుదిరిగి చూడలేదు. పాల్గొనే ప్రతి మీట్‌లోను సత్తాచాటుకున్నాడు. త్రోబాల్‌ లో కూడా ప్రవేశం ఉన్న రమణమూర్తి జాతీయ పోటీల్లో రాణించాడు. అనతి కాలంలోనే జాతీయస్థాయిలో మెరుపులు మెరిపించాడు. సౌత్‌జోన్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో బంగారు పతకం, ఫెడరేషన్‌ కప్‌లో రజత పతకం సాధించాడు. ఇంటర్, ఐటీఐ పూర్తిచేసిన రమణమూర్తి ప్రస్తుతం డిగ్రీ బీఎస్సీ సీబీజెడ్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. 2020 రిపబ్లిక్‌ డే వేడుకల్లో ఉత్తమ క్రీడాకారుడిగా నాటి కలెక్టర్‌ చేతులమీదుగా ప్రశంసా పత్రం అందుకున్నాడు. ప్రస్తుతం జాతీయ జట్టుకు ఎంపికే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. 


కోచ్‌గా, రిఫరీగా కూడా అర్హత.. 

ఒకవైపు ఆటతోపాటు మరోవైపు కోచ్‌గా, రిఫరీగా కూడా అర్హత సాధించిన రమణమూర్తి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2020లో జాతీయ పోటీలకు టెక్నికల్‌ అఫీషియల్స్‌గా/రిఫరీగా వ్యవహరించే రిఫరీ టెస్టులో అర్హత సాధించాడు. పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ప్లేట్‌ అంపైర్‌గా, టెక్నికల్‌ అఫీషియల్స్‌గా కూడా వ్యవహరించి మెప్పించాడు. అలాగే 2021–22లో ఎన్‌ఐఎస్‌ సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేసి కోచ్‌గా కూడా అర్హత సాధించాడు. 


రమణమూర్తి సాధించిన విజయాలు.. 

► 2016–17లో మహారాష్ట్రలో జరిగిన ఆలిండియా స్కూల్‌గేమ్స్‌ అండర్‌–17 సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో ప్రాతినిధ్యం వహించాడు.

► 2016–17లో వైఎస్సార్‌ కడపలోని పుల్లంపేటలో జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌ అండర్‌–19 సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా మూడో స్థానంలో నిలవ డంలో కీలక భూమిక పోషించాడు.

► 2019–20లో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జరిగిన ఫెడరేషన్‌ కప్‌ సీనియ ర్‌ నేషనల్స్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో రజతం సాధించాడు. ఈ పోటీల్లో ఏపీ రన్నరప్‌ గా నిలిచింది.

► 2020లో ఆలిండి యా సౌత్‌జోన్‌ సీనియ ర్స్‌ సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో బంగారు పతకం సాధించాడు. ఈ పోటీ ల్లో ఏపీ విజేతగా నిలిచింది.

► 2022 మార్చిలో గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఆలిండియా యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో బీఆర్‌ఏయూ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ పోటీ ల్లో బీఆర్‌ఏయూ సెమీస్‌లో ఓటమిపాలైంది.  


జాతీయ జట్టుకు ఎంపికే లక్ష్యం.. 

మాది నిరుపేద కుటుంబం. మా అమ్మనాన్న కూలికి వెళ్తే తప్ప జరగని పరిస్థితి. నేను జాతీయస్థాయి క్రీడాకారునిగా గుర్తింపు పొందాను. ఎన్‌ఐఎస్‌ పూర్తి చేసి కోచ్‌గాను, రిఫరీ టెస్టులో క్వాలిఫై అయి టెక్నికల్‌ అఫీషియల్‌గా ఎంపికయ్యాను. నా ప్రతి విజయంలోను నా గురువు ఎంవీ రమణ సర్‌ ప్రోత్సాహం ఉంది. జాతీయ జట్టుకు ఎంపికే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నాను. 
– అంపోలు రమణమూర్తి, సాఫ్ట్‌బాల్‌ జాతీయస్థాయి క్రీడాకారుడు  


నిరంతరం కష్టపడతాడు 

అంపోలు రమణమూర్తి పాఠశాల స్థాయి నుంచి కష్టపడే మనస్తతత్వాన్ని అలవర్చుకున్నాడు. ఉత్తమ లక్షణాలు, నడవడిక కలిగిన రమణమూర్తి ఉన్నత స్థాయికి చేరుకుంటాడని ఆనాడే గుర్తించాను. జిల్లా సాఫ్ట్‌బాల్‌ సంఘం తరఫున బాసటగా నిలిచాం. పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించాడు.   
– ఎంవీ రమణ, ఫిజికల్‌ డైరెక్టర్, సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ముఖ్య ప్రతినిధి

మరిన్ని వార్తలు