ధోని.. మీరు అవకాశాలు ఇచ్చింది ఏది?

20 Oct, 2020 16:55 IST|Sakshi

తప్పుడు స్టేట్‌మెంట్లు వద్దు

మిస్టర్‌ కూల్‌పై మండిపడ్డ శ్రీకాంత్‌

చెన్నై:  చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిపై విమర్శల తాకిడి మొదలైంది. సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఘోరంగా ఓడిపోవడంపై అటు అభిమానులు, ఇటు మాజీలు ధోనిపై మండిపడుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో ఇంకా సీఎస్‌కే గాడిలో పెట్టలేకపోయిన ధోనిపై మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ ధ్వజమెత్తాడు. ప్రధానంగా యువ క్రికెటర్లు స్పార్క్‌ లేదని ధోని చేసిన కామెంట్లపై శ్రీకాంత్‌ విమర్శనాస్త్రాలతో కూడిన ప్రశ్నలు సంధించాడు.  ‘ నేను ధోని చెబుతున్న దానితో ఏకీభవించను. ధోని కేవలం మాటల్లో భాగంగానే అలా మాట్లాడాడు. కానీ నేను మాత్రం అంగీకరించను. అసలు సెలక్షన్‌ ప్రక్రియే దారుణంగా ఉంది. ముందు సీఎస్‌కే సెలక్షన్‌పై దృష్టి పెట్టంది. జగదీశన్‌ లాంటి యువ క్రికెటర్‌ను ఎందుకు పక్కన పెట్టారు. ఒక గేమ్‌లో అవకాశం ఇస్తే 30కి పైగా పరుగులు చేసి ఆకట్టుకున్నాడు కదా.. ముందు మీరు అవకాశాలు ఇస్తే కదా వారి సత్తా తెలిసేది. (రెండో సూపర్‌ ఓవర్‌ కూడా టైగా ముగిస్తే..? )

ఈ సీజన్‌లో మీ ఆటలో మెరుపు ఉందా.. కేదార్‌ జాదవ్‌ ఆటలో మెరుపు ఉందా.. పీయూష్‌ చావ్లా ఆటలో మెరుపు ఉందా.. ఎక్కడ ఉంది సీఎస్‌కేలో మెరుపు. ధోని చెప్పిన ఏ ఒక్క సమాధానాన్ని కూడా నేను ఈరోజు అంగీకరించను. ఇక సీఎస్‌కే కథ ముగిసినట్లే’ అని శ్రీకాంత్‌ విమర్శించాడు. కరణ్‌ శర్మ మంచి వికెట్లు తీసి బ్రేక్‌ ఇస్తుంటే పీయూష్‌ చావ్లాను వేసుకున్నారు. ధోని ఒక గొప్ప క్రికెటర్‌. అందులో సందేహం లేదు. బంతిపై పట్టు దొరకడం లేదనే సమాధానం నాకు నచ్చలేదు. సరైనది కూడా కాదు. మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడుతున్నారు కానీ మీలో పూర్తి పసలేదు. చివరకు ఈ సీజన్‌లో ధోని కూడా తేలిపోయాడు. సీఎస్‌కే జట్టులో ఎవరూ ఆటడం లేదు. అదే మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ప్రతీ ఒక్కర్నీ నిందించాలి.

ఒకసారి ముంబై జట్టును చూడండి. సూర్యకుమార్‌ యాదవ్‌ ఎలా ఆడుతున్నాడో చూడండి. హార్దిక్‌ పాండ్యాను ముంబై ఇండియన్స్‌ ఎలా గుర్తించింది. అతను ఎటాక్‌ ఎలా ఉందో చూస్తున్నాం కదా. ప్రస్తుతం వరల్డ్‌లో హార్దిక్‌ ఒక నంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌. ఆటగాళ్లను గుర్తించే పనిలో ఉండండి. యువ క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వండి.  ముంబై ఇండియన్స్‌ యువ క్రికెటర్లకు అవకాశాలు ఇస్తుంది. ఇషాన్‌ కిషన్‌ కూడా అలాగే సత్తాచాటిన క్రికెటర్‌. ఒక కెప్టెన్‌గా సరైన ప్రకటనలు ఇవ్వండి. ఏ కెప్టెన్‌ కూడా ఇటువంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడు. జగదీశన్‌ ఒక మ్యాచ్‌ ఆడి 30 పరుగులు చేస్తే ఎందుకు మళ్లీ జట్టులో చోటు ఇవ్వలేదు. గతంలో సీఎస్‌కే జట్టులో ఉన్న బాబా అపరాజిత్‌ అనే క్రికెటర్‌ కూడా ఒక్క ఐపీఎల్‌ మ్యాచ్‌ కూడా ఆడకుండానే వెళ్లిపోయాడు. దేశవాళీలో మంచి రికార్డు ఉన్న అపరాజిత్‌కు అప్పుడు అవకాశం ఇవ్వలేదు. ఇకనైనా యువ క్రికెటర్లను ఆడించండి’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు శ్రీకాంత్‌.

మరిన్ని వార్తలు