Asia Cup 2022: పాక్‌ను మట్టికరిపించాక కొలొంబో వీధులు దద్దరిల్లాయి..!

12 Sep, 2022 16:48 IST|Sakshi

ఓ పక్క ఆర్ధిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి.. మరో పక్క చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం, బ్రతుకు భారమై ప్రజలంతా రోడ్లెక్కడం.. ఇలాంటి విపత్కర పరిస్థితుల నడుమ బతుకీడుస్తున్న ద్వీప దేశం శ్రీలంక ప్రజలకు ఓ వార్త భారీ ఊరట కలిగించింది. నిన్న (సెప్టెంబర్‌ 11) దుబాయ్‌ వేదికగా జరిగిన ఆసియా కప్‌​-2022 ఫైనల్లో లంక జట్టు తమకంటే చాలా రెట్లు మెరుగైన పాకిస్తాన్‌కు షాకిచ్చి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది.

ఏమాత్రం అంచనాలు లేకుండా టోర్నీ బరిలోకి దిగిన శ్రీలంక.. ఫైనల్లో పాక్‌ను 23 పరుగుల తేడాతో మట్టికరిపించి ఆరో సారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. నిన్నటి మ్యాచ్‌లో శ్రీలంక గెలుపొందగానే ద్వీప దేశంలో సంబురాలు అంబరాన్ని అంటాయి. మాజీ అధ్యక్షుడు గొటబాయ దేశం వదిలి పలాయనం చిత్తగించిన తర్వాత జనాలు మళ్లీ ఆ స్థాయిలో రోడ్లెక్కి సంబురాలు చేసుకున్నారు.

కర్ఫ్యూ అంక్షలు సైతం పట్టించుకోని జనం కొలొంబో వీధుల్లో జాతీయ జెండాలు చేతబూని నానా హంగామా చేశారు. ముఖ్యంగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన యువత చాలాకాలం తర్వాత రోడ్డపైకి వచ్చి డ్యాన్సులు చేస్తూ ఆనందంగా గడిపారు. వారి సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఈ టోర్నీలో శ్రీలంక పుంజుకున్న తీరును ఆ దేశ ప్రజలు గొప్పగా చెప్పుకున్నారు. విజయ గర్వంతో నినాదాలు చేస్తూ హోరెత్తించారు.

కాగా, టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో భంగపడ్డ శ్రీలంక.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, భారత్‌, పాక్‌లపై వరుస విజయాలు సాధించి టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఫైనల్లో టాస్‌​ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. తొలుత 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టుకోల్పోయింది. అయితే భానుక రాజపక్ష (45 బంతుల్లో 71 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు).. హసరంగ (21 బంతుల్లో 36; 5 ఫోర్లు, సిక్స్‌) సాయంతో చెలరేగి శ్రీలంకు డిఫెండింగ్‌ టోటల్‌ను (170/6) అందించాడు.

ఛేదనలో పాక్‌ ఓ సమయంలో విజయం దిశగా సాగినప్పటికీ.. లంక బౌలర్లు ప్రమోద్‌ మధుశన్‌ (4/34), హసరంగ (3/27), చమిక కరుణరత్నే (2/33) చెలరేగి పాక్‌ ఆటకట్టించారు. పాక్‌ నిర్ణీత ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. 

మరిన్ని వార్తలు