IPL 2022: క్రికెట్‌కు వీరాభిమాని.. ఇతని స్టైల్‌ వేరు

14 May, 2022 11:15 IST|Sakshi

అనకాపల్లి: అతనొక చిరు వ్యాపారి. ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ నడుపుతూ స్వయం ఉపాధి పొందుతున్న మధ్య తరగతికి చెందిన వ్యక్తి. చిన్నప్పుడు క్రికెట్‌ అంటే ఏమిటో తెలియదు. అలాంటిది ఇప్పుడు క్రికెట్‌ వీరాభిమానిగా మారిపోయాడు. ఎంతలా అంటే.. తలపై ఇండియా అనే అక్షరాలతో గుండు గీసుకునే అంతలా.! అతనే అనకాపల్లి గవరపాలెంలో నివాసం ఉంటున్న పి.శ్రీనివాసరావు. వ్యవసాయ కుటుంబానికి చెందిన శ్రీనివాసరావు అనకాపల్లి పట్టణంలోని గౌరీ గ్రంథాలయం పక్కన ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ నడుపుతున్నాడు.

సుమారు మూడు దశాబ్దాల కిందట శ్రీనివాసరావు సొంతూరైన సబ్బవరం మండలంలోని నల్లరేగులపాలెం పరిసరాల్లో చెరువుల్లో క్రికెట్‌ ఆడుతున్న వారిని చూసి.. అలా ఆటపై ఆసక్తి పెంచుకున్నాడు. అక్కడి నుంచి క్రికెట్‌ అంటే ప్రాణమిచ్చేలా మారిపోయాడు.  శ్రీనివాసరావు ప్రతి విషయంలోనూ క్రికెట్‌ మార్క్‌ కనిపించేలా వ్యవహరిస్తుంటాడు. ఇండియా ఆడిన మ్యాచ్‌లంటే అమితాశక్తి. అందుకే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ప్రాంతాల్లో జరిగే క్రికెట్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు వెళ్తుంటాడు.

ఇండియా విజేతగా నిలిస్తే.. అతని షాపు వద్ద సందడే సందడి. ఇండియా, ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతున్న రోజుల్లో శ్రీనివాసరావు ఇండియా క్రికెట్‌ జట్టు జెర్సీని ధరించి.. క్రికెట్‌ ప్లేయర్‌లాగే తయారవుతాడు. ఇండియా అనే అక్షరాలు వచ్చే విధంగా తల వెంట్రుకలను కత్తిరించుకుంటాడు. మిగిలిన భాగాన్ని గుండు గీసుకుంటాడు. గెడ్డంను సైతం ఇండియా, ఐపీఎల్‌ అక్షరాలు వచ్చే విధంగా ట్రిమ్మింగ్‌ చేసుకుంటాడు. ఆర్థికంగా ఇబ్బందులున్నా క్రికెట్‌ మ్యాచ్‌ అంటే మాత్రం ఎంతో సందడిగా కనిపిస్తాడు. క్రికెట్‌కు సంబంధించిన అంశాలతో నిత్యం కనిపించే శ్రీనివాసరావును అందరూ ఆసక్తిగా తిలకిస్తుంటారు.

మరిన్ని వార్తలు