కోహ్లి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జార్వోపై జీవితకాల నిషేధం

28 Aug, 2021 21:52 IST|Sakshi

లీడ్స్‌: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌ మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ప్యాడ్లు కట్టుకుని మైదానంలోకి వచ్చి హడావుడి చేసిన ఇంగ్లండ్‌ ప్రాంక్‌ యూట్యూబర్‌ జార్విస్‌ అలియాస్‌ జార్వో 69పై హెడింగ్లే స్టేడియం యాజమాన్యం జీవితకాల నిషేధం విధించింది. భద్రతా కారణాల రిత్యా అతనిపై ఈ చర్చలకు ఉపక్రమించినట్లు యార్క్‌షైర్‌ కౌంటీ ప్రకటించింది. జార్వో.. టీమిండియా అధికారిక జెర్సీ ధరించడం కూడా నేరంగానే పరిగణించామని సదరు కౌంటీ పేర్కొంది.

మూడో టెస్ట్‌ మూడో రోజు  టీ విరామం తర్వాత 47వ ఓవర్‌లో 59 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ ఓలీ రాబిన్సన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే అంపైర్‌ కాల్‌పై టీమిండియా రివ్యూ కోరింది.  ఇదే సమయంలో జార్వో మైదానంలోకి వచ్చి నానా హంగామా చేశాడు. టీమిండియా జెర్సీలో ప్యాడ్స్, బ్యాట్‌ పట్టుకుని కోహ్లి స్థానంలో  4వ నంబర్‌ బ్యాట్స్‌మన్‌లా క్రీజులోకి వచ్చేశాడు.  అయితే మొదట కోహ్లి వచ్చాడనే భావించిన సెక్యూరిటీ.. తర్వాత తేరుకుని జార్వోను బలవంతంగా బయటికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాగా, జార్వో.. లార్డ్స్‌ టెస్టులోనూ ఇలానే మైదానంలోకి వచ్చి నవ్యులు పూయించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ప్రేక్షకుల గ్యాలరీలో నుంచి వచ్చిన జార్వో టీమిండియా జెర్సీ వేసుకొని ఆటగాళ్లతో కలిసి గ్రౌండ్‌లోకి వచ్చాడు. మొదట జార్వోని గుర్తుపట్టలేకపోయిన భద్రతా సిబ్బంది.. ఆ తర్వాత  అతన్ని బయటికి లాక్కెళ్లారు. ఆ సమయంలో అతను.. 'భారత్‌కు ఆడిన తొలి ఇంగ్లండ్‌ ఆటగాడిని తానేనంటూ గట్టిగా అరుస్తూ చప్పట్లు కొట్టడం' అప్పట్లో ట్రెండింగ్‌గా మారింది. అయితే, అప్పుడు మొదటి తప్పుగా పరిగణించిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఫైన్‌తో సరిపెట్టింది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు