ఇమ్రాన్‌ ఖాన్‌ యార్కర్లు.. పాక్‌ క్రికెట్‌ క్లీన్‌బౌల్డ్‌!

19 Aug, 2021 13:12 IST|Sakshi

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యవహార శైలి.. గురివింద గింజకు ఏమాత్రం తీసిపోదు. ఈ భూమ్మీద ఏ టాపిక్‌ మీద మాట్లాడినా.. అటు ఇటు తిరిగి చివరికి భారత్‌ మీద విమర్శలకు దిగుతుంటాడు. ఈమధ్య లాక్‌డౌన్‌-భారత ఆర్థిక వ్యవస్థపై కామెంట్లు చేసిన ఇమ్రాన్‌ ఖాన్‌.. కరోనా కట్టడిలో విఫలం కావడంపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొన్నాడు.పైగా ప్రధాని అయ్యాక బయటి నుంచి బిలియన్‌ డాలర్ల రుణాల్ని తెచ్చి.. పాక్‌ను అప్పుల ఊబిలోకి ముంచేత్తాడనే విమర్శ ఉండనే ఉంది. 
 
ఇదిలా ఉంటే ఒకప్పుడు స్టార్‌ క్రికెటర్‌ అయిన ఇమ్రాన్‌ ఖాన్‌.. పాక్‌ క్రికెట్‌ను భ్రష్టు పట్టిస్తున్నాడనేది తాజా విమర్శ. పీసీబీని పటిష్టపర్చడం మాట పక్కనపెడితే.. కనీస అవసరాల కోసం నిధుల కేటాయింపు జరపట్లేదని ప్రధాని ఇమ్రాన్‌ను తిట్టిపోస్తున్నారు. ఆ మధ్య ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో పాక్‌ మాజీ క్రికెటర్‌ ఇంజుమామ్‌ ఉల్‌ హక్‌ పరోక్షంగా పాక్‌ ప్రభుత్వాన్ని విమర్శించాడు కూడా.

ఇక 2009 శ్రీలంక టూర్‌ సందర్భంగా జరిగిన ఉగ్రవాద దాడి ఘటన తర్వాత అప్పటి పాక్‌ ప్రభుత్వం.. పూర్తిగా క్రికెట్‌ను విస్మరించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, ఇమ్రాన్‌ అధికారంలోకి వచ్చాక క్రికెట్‌ బాగుపడుతుందనుకుంటే.. పరిస్థితి మరింత దిగజారుతోంది.
 

ఈ తరుణంలో కరోనా దెబ్బతో.. పాక్‌ క్రికెట్‌ మరింత ఆగం అవుతోంది. ఆటగాళ్లకు సరైన ప్రోత్సహాకాలు అందకపోగా.. వర్థమాన క్రికెటర్ల కోసం ప్రకటించిన 40 కోట్ల రూపీలను జారీ చేయలేదు. ఇక ప్రస్తుతం దేశంలో లాహోర్‌, కరాచీలో మాత్రమే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిస్తున్నారు. ముల్తాన్‌, ఫైసలాబాద్‌ స్టేడియాలను డొమెస్టిక్‌ మ్యాచ్‌ల కోసం ఉపయోగిస్తున్నారు. ఇక చాలావరకు స్టేడియంలు మూసుకుపోయాయి. తాజాగా పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ఖానేవాల్‌ క్రికెట్‌ స్టేడియం ఫొటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్‌ అయ్యాయి. కోట్లు ఖర్చు పెట్టిన ఈ స్టేడియాన్ని రైతులు స్వాధీనం చేసుకున్నారు. మిరప, గుమ్మడి మొక్కల్ని సాగు చేస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు క్రికెట్‌ ద్వారా పాక్‌లో హీరోగా వెలుగొందిన ఇమ్రాన్‌ ఖాన్‌.. ఆ ఆటనే విస్మరిస్తూ క్రీడాభిమానుల దృష్టిలో ప్రధాని హోదాలో విలన్‌ అవుతున్నాడు.

క్లిక్‌ చేయండి: వారెవ్వా.. క్రికెటర్‌ కాకున్నా స్టన్నింగ్‌ క్యాచ్‌ పట్టాడు

మరిన్ని వార్తలు