Pat Cummins: ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్‌గా పాట్‌ కమిన్స్‌.. తొలి ఫాస్ట్‌ బౌలర్‌గా రికార్డు

18 Oct, 2022 07:30 IST|Sakshi

ఆస్ట్రేలియా వన్డే జట్టు కొత్త కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే టెస్టు కెప్టెన్‌గా ఉన్న పాట్‌ కమిన్స్‌.. తాజాగా వన్డే జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు. గత నెలలో ఆరోన్‌ ఫించ్‌ టి20లపై దృష్టి  వన్డేల నుంచి రిటైర్‌ కావడంతో అప్పటినుంచి కొత్త కెప్టెన్‌ ఎవరనే దానిపై ఆసీస్‌ క్రికెట్‌లో చర్చ నడిచింది.

తాజాగా నిరీక్షణకు తెరదించుతూ కమిన్స్‌ను వన్డే కెప్టెన్‌గా ఎంపిక చేసింది ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు. ఇక టి20 జట్టును ఆరోన్‌ ఫించ్‌ నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టి20 ప్రపంచకప్‌ తర్వాత ఫించ్‌ రిటైర్‌ అయ్యే అవకాశం ఉండడంతో మరో కొత్త కెప్టెన్‌ను తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కమిన్స్‌ను మూడు ఫార్మట్లకు కెప్టెన్‌ను చేస్తారా లేక టి20 కెప్టెన్‌గా మరొకరిని నియమిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

 ఫించ్ స్థానంలో డేవిడ్ వార్నర్‌కు వన్డే జట్టు పగ్గాలు అప్పగిస్తారని భావించారు. కానీ 2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా శాండ్ పేపర్ వివాదంలో చిక్కుకున్న వార్నర్‌‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టకుండా జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు. గత వారం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ భేటీలో డేవిడ్ వార్నర్‌ కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేయడంపై చర్చ జరిగింది. నిషేధాన్ని ఎత్తివేయడానికి అవసరమైన కోడ్ సవరణను సమీక్షించారు. కానీ కోడ్‌ను ఇంకా సవరించలేదు. దీంతో వార్నర్‌కు కెప్టెన్సీని అప్పగించే విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.

దీంతో టెస్టుల్లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న కమిన్స్‌కే వన్డే బాధ్యతలను కూడా అప్పగించారు. జట్టులో స్టీవ్ స్మిత్, అలెక్స్ కేరీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్ లాంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లకు బదులు.. ఇద్దరు కెప్టెన్లు ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో ఆసీస్ బోర్డు కమిన్స్ వైపు మొగ్గు చూపింది.

ఆస్ట్రేలియాకు కమిన్స్ 27వ వన్డే కెప్టెన్ కాగా.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆసీస్‌ పురుషుల జట్టుకు సారథ్యం వహించనున్న తొలి ఫాస్ట్ బౌలర్ అతడే కావడం విశేషం. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ జరుగుతుండగా.. జట్లన్నీ పొట్టి ఫార్మాట్‌పైనే ఫోకస్ పెట్టాయి. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనుంది. రాబోయే ఆరు నెలల కాలంలో ఆస్ట్రేలియా జట్టు 15 టెస్టులు ఆడనుంది. 

చదవండి: నిమిషాల వ్యవధిలో రెండు అద్భుతాలు.. దటీజ్‌ కోహ్లి

మరిన్ని వార్తలు