Stefanos Tsitsipas: సిట్సి‘పాస్‌’ కాలేదు

29 Jun, 2021 04:55 IST|Sakshi
సిట్సిపాస్, టియాఫో

తొలి రౌండ్‌లోనే ఓడిన మూడో సీడ్‌

అమెరికా ప్లేయర్‌ టియాఫో సంచలనం

మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్‌ క్విటోవాకు షాక్‌  

లండన్‌: మట్టి కోర్టులపై అదరగొట్టే గ్రీస్‌ యువ టెన్నిస్‌ స్టార్, ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ పచ్చిక కోర్టులపై మాత్రం తడబడ్డాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సిట్సిపాస్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ 57వ ర్యాంకర్‌ ఫ్రాన్సెస్‌ టియాఫో (అమెరికా) వరుస సెట్‌లలో 6–4, 6–4, 6–3తో ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌ సిట్సిపాస్‌ను ఓడించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. తన కెరీర్‌లో టాప్‌–5లోని ఆటగాడిపై నెగ్గడం టియాఫోకిదే తొలిసారి. రెండు గంటల రెండు నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో టియాఫో తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోకుండా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. 15 ఏస్‌లు సంధించిన సిట్సిపాస్‌ 22 అనవసర తప్పిదాలు చేశాడు.

మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్, టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) శుభారంభం చేశాడు. జేక్‌ డ్రేపర్‌ (బ్రిటన్‌)తో జరిగిన తొలి రౌండ్‌లో జొకోవిచ్‌ 4–6, 6–1, 6–2, 6–2తో గెలుపొందాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌ ఏకంగా 25 ఏస్‌లు సంధించాడు. మరో  మ్యాచ్‌లో ఐదో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా) 4–6, 6–4, 6–1, 6–2తో డెల్‌బోనిస్‌ (అర్జెంటీనా)పై నెగ్గాడు.  

స్లోన్‌ స్టీఫెన్స్‌ సంచలనం
మహిళల సింగిల్స్‌ విభాగంలో 2011, 2014 చాంపియన్, పదో సీడ్‌ పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. 2017 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్, ప్రపంచ 73వ ర్యాంకర్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా) 6–3, 6–4తో క్విటోవాను ఓడించింది. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో రెండో సీడ్‌ సబలెంకా (బెలారస్‌) 6–1, 6–4తో నికెలెస్కూ (రొమేనియా)పై, 11వ సీడ్‌ ముగురుజా (స్పెయిన్‌) 6–0, 6–1తో ఫియోనా (ఫ్రాన్స్‌) పై, నాలుగో సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) 6–4, 6–2తో జిన్‌యు వాంగ్‌ (చైనా)పై, ఏడో సీడ్‌ స్వియాటెక్‌ (పోలాండ్‌) 6–4, 6–4తో సు వె సెయి (చైనీస్‌ తైపీ)పై, 23వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా) 6–3, 6–4తో స్వాన్‌ (బ్రిటన్‌)పై గెలిచారు.

మరిన్ని వార్తలు