'ధోని విషయంలో ప్రతీసారి ఈ ప్రశ్న వస్తుంది'

23 Sep, 2020 19:43 IST|Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మంగళవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్‌ రావడంపై  విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు ధోని ఏడో స్థానంలో రావడమేంటంటూ పలువురు మాజీ క్రికెటర్లు పెదవి విరిచారు. అయితే రెండు వారాలు క్వారంటైన్‌లో గడపడంతో ప్రాక్టీస్‌కు అంతగా సమయం సరిపోలేదని ధోని పేర్కొన్నాడు. ఈ విషయంలో చెన్నె సూపర్‌కింగ్స్‌ ప్రధాన కోచ్‌ స్టీఫెన్‌ ప్లేమింగ్‌ మాత్రం ధోనికి మద్దతుగా నిలిచాడు.

'ధోని విషయంలో ప్రతీసారి ఈ ప్రశ్న వస్తూనే ఉంటుంది. అయినా ధోని ఇంతకముందు సీజన్లలో కూడా ఐదు లేదా ఆరు స్థానల్లోనే కదా చూశాం. లీగ్‌ ప్రారంభంలోనే ధోనిలో ఉన్న ఫినిషర్‌ బయటకు రావాలనే ఆలోచన వ్యర్థం.. అభిమానుల అంచనాలు అందుకోవడానికి కొంత సమయం పడుతుంది. ధోనిలో మంచి ఆటగాడు ఉన్నాడనేది మాత్రం కచ్చితంగా చెప్పగలను. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ధోని ఏడో స్థానంలో వచ్చినా కొంత సమయం తీసుకున్నాకా.. బ్యాట్‌ ఝులిపించాడు. 16 బంతుల్లో 3 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ధోని ఎంత మంచి ఫినిషరో.. కాకపోతే రాజస్తాన్‌ భారీ స్కోరు చేయడంతో రన్‌రేట్‌ పెరిగిపోయింది.. అ‍ప్పటికే చేయాల్సిన పరుగుల రన్‌రేట్‌ కూడా పెరిగిపోయింది. దానికి ధోని కూడా ఏం చేయలేడు. (చదవండి : ‘ధోని కాకుండా వేరేవాళ్లైతే పరిస్థితేంటి’)

ఒకవేళ ఐదో స్థానంలో వచ్చి ఫెయిలై ఉంటే అప్పుడు కూడా ఇలానే విమర్శించేవారు.  ఇక  స్యామ్‌ కర్జన్‌ బాగానే ఆడినా.. అదే స్ట్రైక్‌ రొటేట్‌ చేయడంలో విఫలమయ్యాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ 19వ ఓవర్‌ వరకు 186 పరుగులతో ఉంది. కానీ ఎన్గిడి వేసిన చివరి ఓవర్లో 30 పరుగులు రావడం చెన్నైకు నష్టంగా మారింది. అని తెలిపాడు.మరోవైపు రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌తో సంజూ సామ్సన్‌ అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా సామ్సన్‌ మైదానం నలువైపులా సిక్సర్లతో రెచ్చిపోయాడు. నిజంగా అతనికి మంచి భవిష్యత్తు ఉందంటూ పేర్కొన్నాడు. కాగా చెన్నై తన తర్వాతి మ్యాచ్‌ సెప్టెంబర్‌ 25న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. (చదవండి : ముంబై వర్సెస్‌ కోల్‌కతా.. పైచేయి ఎవరిదో!)

మరిన్ని వార్తలు