రానున్న రోజుల్లో స్మిత్‌తో టీమిండియాకు కష్టమే

29 Nov, 2020 10:26 IST|Sakshi

సిడ్నీ: రానున్న టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని మంచి ఫామ్‌లో ఉన్న స్టీవ్‌ స్మిత్‌ను తొందరగా ఔట్‌ చేస్తేనే భారత్‌కు ఫలితం ఉంటుందని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌ అభిప్రాయపడ్డాడు. భారత్‌- ఆసీస్‌ జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ డిసెంబర్‌ 17నుంచి జరగనుంది. ఈ సందర్భంగా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో క్లార్క్‌.. స్మిత్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'టెస్టుల్లో స్మిత్‌ బ్యాటింగ్‌ విభాగంలో నెంబర్‌1 స్థానంలో కొనసాగుతున్నాడు. మంచి ఫామ్‌ కనబరుస్తున్న స్మిత్‌ను ఎంత తొందరగా పెవిలియన్‌ పంపిస్తే భారత్‌కు అంత ప్రయోజనం ఉంటుంది. ఈ మధ్యనే సచిన్‌ స్మిత్‌ గురించి చేసిన వ్యాఖ్యలను నేను సమర్థిస్తాను. స్మిత్‌ను తాను ఎదుర్కొనే తొలి 20 బంతుల్లోనే ఔట్‌ చేస్తే ప్రయోజనం ఉంటుందని సచిన్‌ తెలిపాడు. ఇది అక్షరాల నిజం. ఫామ్‌లో ఉన్న ఏ బ్యాట్స్‌మెన్‌ అయినా ఇదే వర్తిస్తుంది. అది సచిన్‌, డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌.. స్మిత్‌ ఇలా ఎవరైనా సరే వారు ఫామ్‌లో ఉన్నారంటే మనకు కష్టాలు తప్పవు. అందుకే ఎల్బీడబ్యూ, బౌల్డ్‌, స్లిప్‌ క్యాచ్‌ ఇలా ఏదో ఒక దానితో ఔట్‌ చేసేందుకు ప్రయత్నించాలి. ఇక స్మిత్‌ విషయంలో స్టంప్‌ లైన్‌పై బౌలింగ్‌ చేస్తే అతను వికెట్‌ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సచిన్‌ చెప్పిన మాటలకు నేను కట్టుబడి ఉంటున్నా. అసలే అద్బుతఫామ్‌లో ఉన్న స్మిత్‌ రానున్న రోజుల్లో మరింత ప్రమాదకరంగా మారనున్నాడు.' అని తెలిపాడు. (చదవండి : రెండో వన్డే : ఆసీస్‌ ఓపెనర్ల జోరు)

ఇరు జట్ల మధ్య ఇప్పటికే ప్రారంభమైన వన్డే సిరీస్‌ ద్వారా స్మిత్‌ తానేంత ప్రమాదకారో చెప్పకనే చెప్పాడు. తొలి వన్డేలో ఆసీస్‌ 66 పరుగులతో విజయం సాధించడం వెనుక వన్‌డౌన్‌లో స్మిత్‌ ఆడిన ఇన్నింగ్స్‌ ప్రధానమని చెప్పొచ్చు. రానున్న మూడు నెలల్లో నాలుగు టెస్టులు, మూడు టీ20లు ఆడాల్సి ఉన్న భారత్‌కు స్మిత్‌ కొరకరాని కొయ్యగా తయారవుతాడనంలో సందేహం లేదు. ఇక సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఏంచుకున్న ఆసీస్‌ మరోసారి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌లు జట్టుకు శుభారంబాన్ని అందించారు. 15 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్‌ వికెట్‌ నష్టపోకుండా 95 పరుగులు సాధించింది. వార్నర్‌ 55 పరుగులతో, ఫించ్‌ 36 పరుగులతో దాటిగా ఆడుతున్నారు. 

>
మరిన్ని వార్తలు