PAK vs AUS: స్టీవ్‌ స్మిత్‌ అరుదైన ఫీట్‌.. టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలేదు!

24 Mar, 2022 16:57 IST|Sakshi

పాకిస్తాన్‌ గడ్డపై ఆస్ట్రేలియా రికార్డుల హోరు సృష్టిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాకపోవడంతో మూడో టెస్టులోనైనా గెలవాలనే పట్టుదలతో ఆసీస్‌ ఆడుతోంది. అందుకు తగ్గట్టుగానే పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో బౌలర్లు విజృంభించగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బ్యాటర్స్‌ పండగ చేసుకుంటున్నారు. లాహోర్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా మరో సెంచరీతో మెరిశాడు. ఇప్పటికే కరాచీ వేదికగా జరిగిన రెండో టెస్టులో 160 పరుగులతో రాణించిన ఖవాజా .. తాజాగా టెస్టు కెరీర్‌లో 12వ సెంచరీ సాధించాడు. నుమాన్‌ అలీ బౌలింగ్‌లో రెండు పరుగులు తీయడం ద్వారా ఖవాజా శతకం మార్కును అందుకున్నాడు. యాషెస్‌ సిరీస్‌ ద్వారా టెస్టుల్లో రీ ఎంట్రీ ఇచ్చిన ఖవాజాకు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.

ఇక ఆస్ట్రేలియా సీనియర్‌ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ టెస్టుల్లో 8వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వార్నర్‌ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్‌ 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఫీట్‌ను సాధించాడు. కాగా 8వేల పరుగులు చేరడానికి స్మిత్‌ 85 టెస్టుల్లో 151 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. తద్వారా టెస్టుల్లో 8వేల పరుగుల మార్క్‌ను అత్యంత వేగంగా అందుకున్న తొలి ఆటగాడిగా స్టీవ్‌స్మిత్‌ ప్రపంచరికార్డు సాధించాడు. ఇంతకముందు శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర 152 ఇన్నింగ్స్‌ల్లో ఎనిమిది వేల పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. 12 ఏళ్ల క్రితం టీమిండియాతో మ్యాచ్‌లో సంగా ఈ ఫీట్‌ను సాధించాడు. సంగక్కర తర్వాతి స్థానంలో భారత్‌ బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌(154 ఇన్నింగ్స్‌లు), విండీస్‌ దిగ్గజం గ్యారీ సోబర్స్‌(157 ఇన్నింగ్స్‌లు), టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌(158 ఇన్నింగ్స్‌లతో) వరుసగా ఉన్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే నాలుగో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 227 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ఖవాజా 104 నాటౌట్‌, డేవిడ్‌ వార్నర్‌ 51 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని ఆసీస్‌ పాకిస్తాన్‌ ముందు 351 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇప్పటికైతే పాకిస్తాన్‌ 10 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్‌ , ఇమాముల్‌ హక్‌ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆటకు మరోరోజు మిగిలి ఉండడంతో ఫలితం వచ్చే అవకాశముంది.

చదవండి: PAK vs AUS: నిన్న కత్తులు దూశారు.. ఇవాళ చేతులు కలిపారు; శుభం కార్డు పడినట్లే!

Manchester United: 23 ఏళ్లకే రిటైర్మెంట్‌.. ఎవరా ఆటగాడు?

మరిన్ని వార్తలు