Steve Smith: స్మిత్‌.. మరీ ఇంత స్వార్థపరుడివనుకోలేదు!

11 Sep, 2022 17:10 IST|Sakshi

ఇటీవలే ఆసియా కప్‌ టోర్నీలో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి 71వ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఆఫ్గన్‌తో మ్యాచ్‌లో సెంచరీ కొట్టి తన నాలుగేళ్ల కరువు తీర్చుకున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా సీనియర్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ కూడా దాదాపు రెండేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో స్మిత్‌ 127 బంతుల్లో వంద పరుగుల మార్క్‌ను అందుకొని వన్డే కెరీర్‌లో 12వ సెంచరీ అందుకున్నాడు.

అయితే సెంచరీ సాధించాడు అని మనం పొగిడేలోపే స్మిత్‌ చేసిన ఒక పని అతన్ని చిక్కుల్లో పడేసింది. మరి ఇంత స్వార్థంగా ఆలోచిస్తాడా అని విషయం తెలుసుకున్న తర్వాత కచ్చితంగా పేర్కొంటారు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ 38వ ఓవర్‌ జేమ్స్‌ నీషమ్‌ వేశాడు. అప్పటికే గ్రౌండ్‌ చుట్టూ చూసిన స్మిత్‌ ఒక పొరపాటును గమనించాడు. వన్డే నిబంధనల ప్రకారం 40 ఓవర్లకు ముందు 30 గజాల సర్కిల్‌ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి. కానీ న్యూజిలాండ్‌ కెప్టెన్‌ ఈ విషయాన్ని మరిచిపోయి ఐదుగురు ఫీల్డర్లను ఉంచాడు.

స్మిత్ చెప్పాలనుకుంటే బంతి పడకముందే చెప్పొచ్చు‌. కానీ అలా చేయకుండా జేమ్స్‌ నీషమ్‌ వేసిన తొలి బంతిని స్క్వేర్‌లెగ్‌ దిశగా భారీ సిక్సర్‌ సంధించాడు. ఆ తర్వాత లెగ్‌ అంపైర్‌వైపు తిరిగిన స్మిత్‌.. ''సర్కిల్‌ బయట నలుగురు ఫీల్డర్లకు బదులు ఐదుగురు ఉన్నారు.. అది నోబాల్‌ ఒకసారి పరిశీలించండి'' అంటూ చేతులతో సైగ చేశాడు. దీంతో తప్పిదాన్ని గమనించిన అంపైర్‌ రూల్స్‌ ప్రకారం నోబాల్‌ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఫ్రీహిట్‌ రాగా.. నీషమ్‌ బౌన్సర్‌ వేశాడు. భారీ షాట్‌ ఆడడానికి ప్రయత్నించి స్మిత్‌ విఫలమయ్యాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ స్మిత్‌పై మండిపడ్డారు. స్మిత్‌ మరీ ఇంత స్వార్థపరుడివనుకోలేదు.. ఒకప్పుడు బాల్‌ టాంపరింగ్‌.. ఇప్పుడు అంపైర్‌ను చీటింగ్‌.. నువ్వు మారవా.. అంటూ కామెంట్లు చేశారు. ఇక స్మిత్‌ సెంచరీతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. స్మిత్‌ 105, లబుషేన్‌ 52 పరుగులు చేయగా.. అలెక్స్‌ క్యారీ 42 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. చివర్లో కామెరాన్‌ గ్రీన్‌ 12 బంతుల్లో 25 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు.

చదవండి: Kane Williamson: కెప్టెన్లంతా ఔట్‌.. ఒక్క కేన్‌ మామ తప్ప..!

 బిన్నీ ఊచకోత.. సౌతాఫ్రికాపై ఇండియా లెజెండ్స్ ఘన విజయం

మరిన్ని వార్తలు