ఆసీస్‌కు మరో దెబ్బ.. స్మిత్‌‌ అనుమానమే!

15 Dec, 2020 17:43 IST|Sakshi

అడిలైడ్‌ : టీమిండియాతో టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందే ఆసీస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గాయంతో దూరం కాగా.. ఆసీస్‌ కీలక బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ తొలి టెస్టు ఆడేది అనుమానంగా కనిపిస్తుంది. మంగళవారం ఉదయం ప్రాక్టీస్‌ సమయంలో ఫీల్డింగ్‌ చేస్తున్న స్మిత్‌కు గాయమైనట్లు సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో బ్యాటింగ్‌ చేయకుండానే స్మిత్‌ హోటల్‌ రూంకు వెళ్లిపోయాడని తెలిపింది. (చదవండి : రబ్బిష్‌.. కోహ్లిని మేమెందుకు తిడతాం)

అయితే స్మిత్‌ గాయంపై ఎటువంటి క్లారిటీ లేదు. ఒకవేళ గాయం ఎక్కువగా ఉంటే మాత్రం తొలి టెస్టు ఆడేది అనుమానంగా కనిపిస్తుంది. ఇదే నిజమైతే ఆసీస్‌కు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. వన్డే సిరీస్‌ను ఆసీస్‌ గెలవడంలో స్మిత్‌​ కీలక పాత్ర పోషించాడు. వరుస సెంచరీలతో హోరెత్తించిన అతను అద్భుత ఫామ్‌ కనబరుస్తూ టెస్టు సిరీస్‌కు కీలకంగా మారాడు. ఈ దశలో స్మిత్‌కు గాయం కావడం ఆసీస్‌కు ఇబ్బందిగా మారనుంది. (చదవండి : అంపైర్‌ చీటింగ్‌.. అసలు అది ఔట్‌ కాదు)

ఇప్పటికే స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ దూరమవడం.. తాజాగా స్మిత్‌  గాయపడడం దీనిని మరింత రెట్టింపు చేసింది. అంతేగాక యువ ఓపెనర్‌ విన్‌ పుకోవిస్కి త్యాగి బౌన్సర్‌ దెబ్బకు మొదటి టెస్టుకు దూరం కావాల్సి వచ్చింది. ఇక టీమిండియాతో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ కీలక బౌలర్‌ సీన్‌ అబాట్‌ కండరాలు పట్టేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు దిగలేదు. ఆ తర్వాత అబాట్‌ తొలి టెస్టుకు దూరమైనట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. 

అంతకముందు బుమ్రా ఆడిన స్ట్రెయిట్‌డ్రైవ్‌ కామెరాన్‌ గ్రీన్‌ తలకు బలంగా తాకడంతో తొలి టెస్టుకు అతను కూడా దూరమవుతాడని భావించారు.. కానీ అదృష్టం బాగుండి గాయం తీవ్రత పెద్దగా లేకపోవడంతో తొలి టెస్టులో గ్రీన్‌ ఆడుతున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఏదైమైనా స్మిత్‌ తొలి టెస్టుకు దూరమైతే మాత్రం ఆసీస్‌ విజయంపై ప్రభావం పడనుంది. 2018-19 సిరీస్‌లోనూ స్మిత్‌, వార్నర్‌లు ఆడకపోవడంతో 2-1 తేడాతో టీమిండియా సిరీస్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 17న అడిలైడ్‌ వేదికగా కాగా ఇరుజట్ల మధ్య తొలి డే నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది.

మరిన్ని వార్తలు