Steve Smith: గిల్‌కు అంత సీన్‌ లేదు.. ప్రపంచ క్రికెట్‌ను శాసించబోయేది అతడే..!

21 Feb, 2023 16:08 IST|Sakshi

అవకాశం దొరికితే టీమిండియా ఆటగాళ్లపై బురదజల్లేందుకు పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా మాజీలు, ఆ రెండు జట్ల అభిమానులు రెడీగా ఉంటారన్న విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ రెండు దేశాలకు చెందిన వారు భారత ఆటగాళ్లపై అక్కసు వెళ్లగక్కి, విషం చిమ్మే అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అని గోతికాడి నక్కల్లా ఎదురు చూస్తూ ఉంటారు. సాధారణంగా ఇలాంటి వారికి అవకాశం ఇ​వ్వకుండా మనవాళ్లు ఆన్‌ ఫీల్డ్‌, ఆఫ్‌ ద ఫీల్డ్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఇలాంటి అవకాశం ఎప్పుడోసారి దొరికితే మాత్రం ఈ రెండు దేశాలకు చెందిన వారు పండుగ చేసుకుంటారు.

తాజాగా ఇలాంటి ఓ అవకాశమే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు దొరికింది. ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్‌ఫోలో ఓ సందర్భంగా భవిష్యత్తు క్రికెట్‌ సూపర్‌ స్టార్‌ ఎవరు అనే ప్రశ్నను నిర్వహకులు స్మిత్‌ను అడిగారు. ఈ ప్రశ్నకు వారు టీమిండియా శుభ్‌మన్‌ గిల్‌, ఇంగ్లండ్‌ యువ కెరటం​ హ్యారీ బ్రూక్స్‌ అనే రెండు ఆప్షన్స్‌ కూడా ఇచ్చారు. టీమిండియా ఆటగాళ్లను తక్కువ చేసి చూపే ఇలాంటి ఓ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న స్మిత్‌కు ఈ ప్రశ్న రూపంలో బంపరాఫర్‌ వచ్చింది.

ఈ ప్రశ్న సంధించగానే ఏమాత్రం తడుంకోని స్మిత్‌, రెండో ఆప్షన్‌ లేదు అన్నట్లుగా ఠక్కున హ్యారీ బ్రూక్‌ పేరు చెప్పాడు. 23 ఏళ్ల హ్యారీ బ్రూకే భవిష్యత్తు సూపర్‌ స్టార్‌ అని కితాబునిచ్చాడు. టీమిండియా శుభ్‌మన్‌ గిల్‌తో పోలిస్తే బ్రూక్‌ అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉన్నాడని కొనియాడాడు. స్మిత్‌ ఆన్సర్‌తో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ కూడా ఏకీభవించాడు.

దీంతో స్మిత్‌ మరింత సౌండ్‌ పెంచి టెక్నిక్‌ విషయంలో, విదేశీ పిచ్‌లపై బ్రూక్‌ అద్భుతమైన ప్రదర్శనలు కనబర్చాడని పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ టూర్‌లను ఉదహరించాడు. గిల్‌కు వ్యతిరేకంగా ఓటు వేసి శునకానందం పొందుతున్న స్మిత్‌కు భారత అభిమానులు తగిన బుద్ధిచెబుతున్నారు. గతంలో కోహ్లిని, నిన్ను ఇలాగే పోల్చారు.. ఇప్పుడు కోహ్లి ఎక్కడ.. నువ్వు ఎక్కడా అంటూ గాలి తీసేస్తున్నారు. 

కాగా, ఫ్యూచర్ సూపర్ స్టార్ ఎవరు అనే విషయంపై ఎవరి అభిప్రాయాలు వారికున్నప్పటికీ.. గిల్, బ్రూక్‌ ఇద్దరు సూపర్‌ టాలెంటెడ్‌ ఆటగాళ్లన్న విషయం ఒప్పుకోవాల్సిందే. తొలుత టెస్ట్‌ల్లోనే సత్తా చాటిన గిల్ ఆ తర్వాత వన్డే, టీ20ల్లోనూ చెలరేగిపోయాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన అతి కొద్దిమంది క్రికెటర్లలో గిల్‌ కూడా ఒకడిగా నిలిచాడు. బ్రూక్‌ విషయానికొస్తే.. ఇతను కూడా ఆరంగ్రేటం నుంచి ఫార్మాట్లకతీతంగా అదిరిపోయే పర్ఫామెన్స్‌తో అదరగొడుతున్నాడు. వన్డేలు, టీ20లతో పోలిస్తే బ్రూక్‌ టెస్ట్‌ల్లో చెలరేగిపోతున్నాడు. 8 ఇన్నింగ్స్‌లో 77.9 సగటున 3 సెంచరీలు, 3 హాఫ్‌ సెంచరీల సాయంతో 623 పరుగులు చేశాడు. 
 

మరిన్ని వార్తలు