Steve Smith: 'ఇయాన్‌ చాపెల్‌ వ్యాఖ్యలను బాత్‌రూం అద్దానికి అంటించా'

1 Dec, 2021 21:34 IST|Sakshi

Steve Smith Says Ian Chapell Coloumn Stuck On Bathroom Mirror: ఆస్ట్రేలియా సీనియర్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ కెరీర్‌లో బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం ఒక చీకటికోణంలా మిగిలిపోయింది. 2018లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌, బెన్‌క్రాఫ్ట్‌లతో కలిసి స్మిత్‌ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడడం సంచలనంగా మారింది. ఈ అంశం అప్పట్లో తీవ్ర దుమారం రేపడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) సీరియస్‌గా పరిగణించింది. కెప్టెన్సీ పదవి నుంచి స్మిత్‌ను తొలిగించిన సీఏ అతనితో పాటు డేవిడ్‌ వార్నర్‌పై ఏడాదిపాటు నిషేధం.. బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించింది. అలా 2018 నుంచి 2019 వరకు క్రికెట్‌కు దూరంగా ఉన్న స్మిత్‌ రీ ఎంట్రీలో అదరగొట్టాడు. 

చదవండి: WI vs SL: క్రీజులో పాతుకుపోయాడు.. తెలివైన బంతితో బోల్తా

తాజాగా ఇంగ్లండ్‌తో యాషెస్‌ సిరీస్‌కు సిద్ధమవుతున్న ఈ ఆసీస్‌ ఆటగాడు మరోసారి ఆ చీకటి రోజులను గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో ఇయాన్‌ చాపెల్‌ చేసిన వ్యాఖ్యలు తనకు ఎప్పటికి గుర్తుండిపోయాయని చెప్పుకొచ్చాడు. '' బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం నాకు చీకటిరోజులు.  ఈ ఉదంతంతో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న నేను నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. నాకు ఇయాన్‌ చాపెల్‌ వ్యాఖ్యలు బాగా గుర్తున్నాయి. ఒక పత్రికలో ఇయాన్‌ చాపెల్‌ తన కాలమ్‌లో '' బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంతో ఏడాది పాటు ఆటకు దూరం కానున్న స్మిత్‌ .. ఏడాది తర్వాత రీ ఎంట్రీలో అతనిలో అదే బ్యాటర్‌ కనబడడు'' అని పేర్కొన్నాడు. ఇయాన్‌ చాపెల్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న నేను ఆ పేపర్‌ ముక్కను కట్‌చేసి నా బాత్‌రూం గోడకు తగిలించాను.

ప్రతీరోజు రాత్రి నిద్రపోయే ముందు.. ఉదయం నిద్ర లేవగానే దానిని చూసుకునేవాడిని. ఆ వ్యాఖ్యల చదువుతూ బ్రష్‌ చేసేవాడిని. అయితే 2019లో రీఎంట్రీ తర్వాత యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించాను. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో అటు చాపెల్‌కు.. విమర్శలకు ఒక విషయం చెప్పా.. అదేంటంటే..  ''నిషేధం తర్వాత నేను ఏం కోల్పోలేదు.. అది ఇంకా నా దగ్గరే ఉంది''.  ఈ విషయం నాకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా నేను సాధించాననే సంతోషం కలుగుతుంది'' అంటూ పేర్కొన్నాడు. 

చదవండి: Joshua da Silva Vs Dhananjaya de Silva: వార్నీ.. ప్రతీకారం ఇలా కూడా తీర్చుకుంటారా!

ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్‌ టెస్టు సిరీస్‌ డిసెంబర్‌ 8 నుంచి ప్రారంభం కానుంది. ఇక సెక్స్‌ స్కాండల్‌ ఆరోపణలతో టిమ్‌ పైన్‌ అనూహ్యంగా కెప్టెన్సీ పదవికి రాజీనామా చేయడంతో పాట్‌ కమిన్స్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఇక స్టీవ్‌ స్మిత్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఇక 2019లో జరిగిన యాషెస్‌ సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఏడాది నిషేధం నుంచి తిరిగొచ్చిన స్టీవ్‌ స్మిత్‌ ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు సహా మొత్తంగా 777 పరుగులు సాధించి ఆసీస్‌ సిరీస్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.

మరిన్ని వార్తలు