ఆర్చర్‌ రెచ్చిపోతాడని అప్పుడు ఊహించలేదు 

23 Sep, 2020 15:41 IST|Sakshi
జోఫ్రా ఆర్చర్‌(కర్టసీ : బీసీసీఐ)

దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌ సందర్భంగా మంగళవారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌(ఆర్‌ఆర్‌) ఆటగాడు జోఫ్రా ఆర్చర్‌ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. మొదట శామ్సన్‌ సిక్సర్లతో రెచ్చిపోగా.. చివర్లో ఆర్చర్‌ ఎన్గిడి బౌలింగ్‌లో నాలుగు సిక్సర్లు బాది తనలోనూ మంచి ఆల్‌రౌండర్‌ ఉన్నాడని చెప్పకనే చెప్పాడు. ఆర్చర్‌ విధ్వంసంతో మొదటిసారి ఈ ఐపీఎల్‌లో 200 స్కోరు దాటేసింది. ఆసీస్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌ తన అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న ఆర్చర్‌ బ్యాటింగ్‌లో ఇలా రెచ్చిపోతాడని బహుశా రాజస్తాన్‌ జట్టు కూడా ఊహించి ఉండదు. చెన్నైతో మ్యాచ్‌ అనంతరం ఆర్‌ఆర్‌ జట్టు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఆర్చర్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు.(చదవండి : ‘ధోని కాకుండా వేరేవాళ్లైతే పరిస్థితేంటి’)

'జోఫ్రా అద్భుతమైన బ్యాటింగ్‌ కనబరిచాడు. అయితే నిజానికి మ్యాచ్‌కు ముందురోజు నేను ప్రాక్టీస్‌లో బిజీ ఉండగా.. ఆర్చర్‌ నా వద్దకు వచ్చి.. స్మిత్‌ నువ్వు నెట్స్‌ నుంచి బయటికి వెళ్లు.. నేను హిట్టింగ్‌ ప్రాక్టీస్‌ చేయాలి.. అదేంటి బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేయకుండా.. హిట్టింగ్‌ చేస్తానని చెప్పడమేంటని అనుకున్నా. కానీ మ్యాచ్‌లో ఇలా విధ్వంసం సృష్టిస్తాడని అప్పుడు నేను ఊహించలేకపోయా. బ్యాటింగ్‌కు వచ్చిన ఆర్చర్‌ మొదటి నాలుగు బంతులను సిక్సులుగా మలవడం ఆశ్చర్యం కలిగించింది. ఆర్చర్‌ బౌలింగ్‌లోనే కాదు.. బ్యాటింగ్‌లోనూ ఇరగదీస్తాడని ఆ క్షణమే అనుకున్నా.. అద్భుతమైన బ్యాటింగ్‌తో మా జట్టుకు మంచి కిక్‌ ఇచ్చాడంటూ' చెప్పుకొచ్చాడు.

అయితే చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లుగా స్టీవ్‌ స్మిత్‌, యశస్వి జైశ్వాల్‌ రావడం తెలిసిందే. జోస్‌ బట్లర్‌ గైర్హాజరీలో స్మిత్‌ ఓపెనర్‌గా రావాల్సి వచ్చింది. అయితే ఆసీస్‌తో సిరీస్‌ ముగిసిన తర్వాత జోస్‌ బట్లర్‌ కాస్త ఆలస్యంగా దుబాయ్‌ చేరుకున్నాడు. నిబంధనల ప్రకారం ఏ ఆటగాడైనా 6రోజులు క్వారంటైన్‌ తప్పనిసరి. కానీ బీసీసీఐ రూల్స్‌ సవరించి 36 గంటల క్వారంటైన్‌ విధించిన్పటికి బట్లర్‌ మ్యచ్‌కు రెండు రోజులు ముందే దుబాయ్‌ చేరుకున్నాడు. దీంతో మొదటి మ్యాచ్‌కు బట్లర్‌ దూరమవ్వాల్సి వచ్చింది. బట్లర్‌ తరువాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా అనే విషయంపై స్మిత్‌ను అడగ్గా.. 'చూద్దాం.. ఇప్పటికైతే జట్టు కూర్పు బలంగా ఉంది.. తర్వాతి మ్యాచ్‌లో ఇదే జట్టు కొనసాగవచ్చంటూ' పేర్కొన్నాడు. చెన్నైపై విజయంతో జోష్‌ మీదున్న రాజస్తాన్‌ సెప్టెంబర్‌ 24న కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌తో తలపడనుంది.

మరిన్ని వార్తలు