Steve Smith: అదృష్టం కలిసొచ్చిన వేళ..

17 Jan, 2023 17:04 IST|Sakshi

ఆస్ట్రేలియా సీనియర్‌ ఆటగాడు స్టీవ్‌స్మిత్‌ ప్రస్తుతం బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో బిజీగా ఉన్నాడు. సిడ్నీ సిక్సర్స్‌ తరపున ఆడుతున్న స్మిత్‌ మంగళవారం అడిలైడ్‌ స్ట్రైకర్స్‌తో మ్యాచ్‌లో సూపర్‌ శతకంతో మెరిసిన సంగతి తెలిసిందే. కేవలం 56 బంతుల్లోనే ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సహాయంతో 101 పరుగుల సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. 

అయితే విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిసిన స్మిత్‌కు మ్యాచ్‌లో ఒకచోట అదృష్టం కూడా బాగా కలిసి వచ్చింది. బంతి వికెట్లను తాకినప్పటికి బెయిల్స్‌ కిందపడక పోవడంతో స్మిత్‌ ఔట్‌ నుంచి తప్పించుకున్నాడు. హ్యారీ కాన్వే వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో ఇది చోటు చేసుకుంది. కాన్వే విడుదల చేసిన బంతి స్మిత్‌ బ్యాట్‌ సందులో నుంచి వెళ్లి మిడిల్‌ వికెట్లకు తాకింది. అయితే బంతి బలంగా తగలకపోవడంతో బెయిల్స్‌ ఏమాత్రం కదల్లేదు. ఆ తర్వాత బంతిని తీసుకున్న స్మిత్‌ ఫీల్డర్‌కు అందజేశాడు.

ఆ సమయంలో స్మిత్‌ కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు. అలా బతికిపోయిన స్మిత్‌ ఆ తర్వాత సెంచరీతో విరుచుకుపడ్డాడు. అదృష్టం కలిసిరావడం అంటే ఇదేనేమో అంటూ అభిమానులు కామెంట్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే సిడ్నీ సిక్సర్స్‌ విజయం దిశగా సాగుతుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ సిక్సర్స్‌ స్మిత్‌ సెంచరీతో  నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. స్మిత్‌తో పాటు కర్టిస్‌ పాటర్సన్‌ 43.. చివర్లో జోర్డాన్‌ సిల్క్‌ 16 బంతుల్లో 31 పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి ఓటమి అంచున నిలిచింది. మాథ్యూ షార్ట్‌(40), అలెక్స్‌ కేరీ(54) మినహా మిగతావారు విఫలమయ్యారు.

చదవండి: స్టీవ్‌ స్మిత్‌కు పూనకం వచ్చింది.. విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు

ఆస్ట్రేలియాకు షాక్‌.. నంబర్‌ వన్‌ స్థానానికి టీమిండియా

మరిన్ని వార్తలు