బాక్సింగ్‌ డే టెస్టు : స్టీవ్‌ స్మిత్‌ డకౌట్‌

26 Dec, 2020 07:14 IST|Sakshi

మెల్‌బోర్న్‌ : బోర్డర్‌ గావస్కర్‌ ట్రోపీలో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో భారత బౌలర్లు మెరిశారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌కు టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తొలిషాక్‌ ఇచ్చాడు. ఓపెనర్‌ జో బర్న్స్‌ను డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. దీంతో ఆసీస్‌ 10 పరుగుల వద్ద మొదటి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మార్నస్‌ లబుషేన్‌తో కలిసి మరో ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశాడు. వీరి జోడి బలపడుతున్న తరుణంలో బౌలింగ్‌కు వచ్చిన రవిచంద్రన్‌ అశ్విన్‌ వేడ్‌ను 30 పరుగుల వద్ద ఔట్‌ చేయడంతో ఆసీస్‌ 35 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఈ దశలో మరోసారి బౌలింగ్‌కు వచ్చిన అశ్విన్‌ స్మిత్‌ను డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. దీంతో ఆసీస్‌ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఆసీస్‌ 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. లబుషేన్‌ 26 పరుగులు, ట్రెవిస్‌ హెడ్‌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కాగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఇది 100వ టెస్ట్‌ మ్యాచ్‌ కావడం విశేషం. ఇప్పటివరకు ఆస్ట్రేలియా 43 మ్యాచ్‌ల్లో, భారత్‌ 28 మ్యాచ్‌ల్లో గెలిచాయి. మిగతా 27 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. ఒక టెస్టు ‘టై’గా ముగిసింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియా 30 టెస్టుల్లో గెలిచింది. 7 మ్యాచ్‌ల్లో ఓడి, 12 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. భారత్‌ స్వదేశంలో 21 టెస్టుల్లో నెగ్గి, 13 మ్యాచ్‌ల్లో ఓడింది. 15 ‘డ్రా’ కాగా, ఒక టెస్టు ‘టై’ అయింది.

మరిన్ని వార్తలు