IPL 2022: ఐపీఎల్‌కి దూరంగా ఇంగ్లండ్‌ స్టార్లు.. విండీస్‌ విధ్వంసకర యోధుడు కూడా..

22 Jan, 2022 17:08 IST|Sakshi

Most Of England Players Including Gayle To Skip IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్‌కి ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్లు సామూహికంగా డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ సారి జరగబోయే మెగా వేలంలో మొత్తం 1214 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. కొందరు ఇంగ్లండ్‌ క్రికెటర్లు మాత్రం లీగ్‌పై అనాసక్తి కనబర్చారు. వేలం కోసం 30 మంది ఇంగ్లండ్‌ ప్లేయర్లు రిజిస్టర్‌ చేసుకోగా.. జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌, క్రిస్‌ వోక్స్‌, సామ్‌ కర్రన్‌ వంటి స్టార్‌ క్రికెటర్లు దూరంగా ఉన్నారు. అయితే బెయిర్ స్టో, టామ్ కర్రన్, ఇయాన్ మోర్గాన్, జోస్ బట్లర్ వంటి ప్లేయర్లు ఐపీఎల్ వేలం కోసం తమ పేర్లను రిజిస్టర్‌ చేయించుకున్నారు.

మరోవైపు వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాటర్‌, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ సైతం క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు డుమ్మా కొట్టాడు. ఐపీఎల్‌ ఆరంభం నుంచి లీగ్‌లో కొనసాగుతున్న గేల్‌.. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని క్రికెట్‌ ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అతను ఐపీఎల్‌ మెగా వేలం కోసం తన పేరు నమోదు చేసుకోలేదని సమాచారం. కాగా, వీరితో పాటు ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ కూడా ఐపీఎల్‌పై అనాసక్తి కనబర్చాడు. తొలుత అతను లీగ్‌లో పాల్గొంటానని ప్రకటించినప్పటికీ.. నిర్ణీత గడువు సమయానికి పేరును నమోదు చేసుకోలేదు. 

ఇదిలా ఉంటే, వేలంలో పాల్గొనబోయే 1214 మంది ఆటగాళ్లలో 896 మంది భారతీయ క్రికెటర్లు కాగా.. 318 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో 270 మంది క్యాప్‌డ్‌ (జాతీయ జట్టు తరఫున ఆడినవారు), 903 మంది అన్‌క్యాప్‌డ్ (జాతీయ జట్టుకు ఆడని వారు), 41 మంది అసోసియేట్‌ ప్లేయర్లు ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా ఆస్ట్రేలియా(59)కు చెందిన వారు కాగా, ఆ తర్వాత సౌతాఫ్రికా (48), శ్రీలంక (36), ఇంగ్లండ్ (30), న్యూజిలాండ్‌ (29), అఫ్ఘానిస్థాన్‌ (20) దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. నేపాల్‌ (15), యూఎస్‌ఏ (14), నమీబియా (5), ఒమన్ (3), భూటాన్‌ (1), యూఏఈ (1), నెదర్లాండ్స్‌ (1), స్కాట్లాండ్‌ వంటి అసోసియేట్ దేశాల ఆటగాళ్లు సైతం మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 
చదవండి: IPL 2022: మెగా వేలంలో కోట్లు కొల్లగొట్టేది వీళ్లే..

మరిన్ని వార్తలు