స్టోక్స్‌ వచ్చేస్తున్నాడు..!

24 Sep, 2020 17:51 IST|Sakshi
బెన్‌ స్టోక్స్‌(ఫైల్‌ఫోటో)

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ప్లేయర్‌ బెన్‌ స్టోక్స్‌ ఆడతాడా.. లేదా అనే దానికి క్లారిటీ వచ్చింది. స్టోక్స్‌ త్వరలోనే రాజస్తాన్‌ జట్టుతో కలిసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ మేరకు ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌..  స్టోక్స్‌ రాకపై పెదవి విప్పాడు. తొందర్లోనే స్టోక్స్‌ జట్టుతో కలుస్తాడని  బట్లర్‌ తెలిపాడు. అక్టోబర్‌ తొలి వారంలో స్టోక్స్‌ యూఏఈకి వస్తాడని చెప్పుకొచ్చాడు. దీనిలో భాగంగా న్యూజిలాండ్‌లో స్టోక్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న విషయాన్ని బట్లర్‌ పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌లో ఉండే స్టోక్స్‌ తండ్రి క్యాన్సర్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో గత నెల పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. న్యూజిలాండ్‌ దేశస్తుడైన స్టోక్స్‌.. ఇంగ్లండ్‌ తరఫున ఆడుతున్నాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ను ఇంగ్లండ్‌ సాధించడంలో స్టోక్స్‌ కీలక పాత్ర పోషించాడు.(చదవండి:సీస్‌ మాజీ క్రికెటర్‌ డీన్‌జోన్స్‌ ఇకలేరు..)

ఆరు రోజుల క్వారంటైన్‌..
అక్టోబర్‌ తొలి వారంలో స్టోక్స్‌ వచ్చినా ఐపీఎల్‌ తొలి అర్థభాగాన్ని కోల్పోతాడు. యూఏఈకి వచ్చిన  తర్వాత కరోనా వైరస్‌ నిబంధనల ప్రకారం స్టోక్స్‌ ఆరు రోజులు క్వారంటైన్‌ ఉండాలి. ఆపై కరోనా నెగిటివ్‌ వస్తేనే జట్టుతో కలుస్తాడు. ఇవన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబర్‌ రెండో వారంలో కానీ స్టోక్స్‌ రాజస్తాన్‌ జెర్సీ  ధరించే అవకాశం ఉండదు. రాజస్తాన్‌ రాయల్స్‌లో కూడా ప్రధాన ఆటగాళ్లంతా విదేశీ ఆటగాళ్లే ఉన్నారు. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌తో పాటు టామ్‌ కరాన్‌, జోఫ్రా ఆర్చర్‌, డేవిడ్‌  మిల్లర్‌, జోస్‌ బట్లర్‌ వీరంతా విదేశీ ఆటగాళ్లే. దాంతో ఆర్‌ఆర్‌కు సరికొత్త తలనొప్పి మొదలైంది. తుది జట్టులో నలుగురు మించి విదేశీ ఆటగాళ్లు ఉండకూడదనే నిబంధనతో ఆర్‌ఆర్‌కు సైతం ఇబ్బందిగా మారింది. ఇక స్టోక్స్‌ కలిస్తే టామ్‌ కరాన్‌ను పక్కకు పెట్టక తప్పదు. సీఎస్‌కేతో రాజస్తాన్‌ ఆడిన తొలి మ్యాచ్‌లో టామ్‌ కరాన్‌ ఆడాడు. ప్రస్తుతానికి టామ్‌ కరాన్‌ ఎంపికకు ఇబ్బంది లేకపోయినా స్టోక్స్‌ వస్తే మాత్రం టామ్‌ రిజర్వ్‌ బెంచ్‌కు పరిమితం కావాల్సిందే.

మరిన్ని వార్తలు