Pele: తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకున్నవేళ

30 Dec, 2022 15:01 IST|Sakshi

అది 1950 ఫిఫా వరల్డ్‌‍కప్‌.. ఆతిథ్య దేశం బ్రెజిల్‌, ఉరుగ్వే  మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఫైనల్లో ఉరుగ్వే చేతిలో ఓడిన బ్రెజిల్‌ రన్నరప్‌గా నిలిచింది. బ్రెజిల్‌ ఓడిపోవడం చూసి ఒక వ్యక్తి కన్నీటిపర్యంతం అయ్యాడు. ఆయన పక్కనే ఉన్న ఒక పదేళ్ల పిల్లాడు కూడా ఆ వ్యక్తి అలా ఏడ్వడం చూసి తట్టుకోలేకపోయాడు. ఆ పదేళ్ల పిల్లాడు మరెవరో కాదు.. ఫుట్‌బాల్‌ లెజెండరీ ఆటగాడు.. పీలే.

బ్రెజిల్‌కు మూడుసార్లు ఫిఫా వరల్డ్‌కప్‌ అందించి హీరోగా నిలిచాడు. ఇక పీలే పక్కనున్న వ్యక్తి ఇంకెవరో కాదు స్వయానా ఆయన తండ్రి డోండిన్హో. తన పదేళ్ల వయసులో నాన్న గుక్కపట్టి ఏడ్వడం గమనించిన పీలే.. నాన్న ఏడ్వకు.. ఈరోజు నీకు మాట ఇస్తున్నా.. బ్రెజిల్‌కు కచ్చితంగా వరల్డ్‌కప్‌ అందించి తీరుతా అని పేర్కొన్నాడు. అప్పటికే పదేళ్ల వయసు మాత్రమే ఉన్న పీలే మాటలు తండ్రికి నమ్మశక్యంగా అనిపించలేదు. 


1958 ఫిఫా ఫైనల్‌  గెలిచిన అనంతరం పీలే 

కట్‌చేస్తే.. ఎనిమిది సంవత్సరాల తర్వాత 1958 ఫిపా వరల్డ్‌కప్‌లో బ్రెజిల్‌ తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. ఈ విజయంలో కీలకపాత్ర పోషించింది పీలేనే. తండ్రికిచ్చిన మాటను నిలబ్టెట్టుకోవాలని మోకాలి గాయాన్ని సైతం లెక్కచేయకుండా వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగాడు. ఆ వరల్డ్‌కప్‌లో పీలే మొత్తంగా ఆరు గోల్స్‌ చేశాడు. సెమీఫైనల్లో హ్యాట్రిక్‌ గోల్స్‌ నమోదు చేసిన పీలే ఫైనల్స్‌లోనే రెండు గోల్స్‌ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

అప్పటికి పీలే వయస్సు కేవలం 17 ఏళ్లు మాత్రమే. 17 ఏళ్ల వయసులోనే ఫుట్‌బాల్‌లో సంచలనాలు సృష్టించిన పీలే ఆ తర్వాత ఎంత ఎత్తుకు ఎదిగాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక 1958 ఫిఫా వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత ట్రోఫీని తీసుకెళ్లి తండ్రికి అందించాడు. ఆ సమయంలో పీలే తండ్రి దోహిన్హో పీలేను హత్తుకొని కన్నీరు కార్చడం ప్రతీ ఒక్కరి గుండెలను కదిలించింది.

తన పదేళ్ల వయసులో ఫిఫా వరల్డ్‌కప్‌ రాలేదని తండ్రి ఏడ్వడం చూసిన పీలే.. తన తండ్రి మరోసారి అలా ఏడ్వకూడదని నిశ్చయించుకున్నాడు. అందుకే కడు పేదరికంలో పెరిగినప్పటికి ఫిఫా వరల్డ్‌కప్‌ నెగ్గాలనే లక్ష్యంతోనే ఎన్ని కష్టాలొచ్చినా వాటిని బరిస్తూ ముందుకు కదిలాడు. ఆ తర్వాతి ఎనిమిదేళ్లలో ఫుట్‌బాల్‌లో సూపర్‌స్టార్‌గా ఎదిగి తండ్రి కోరికను సాకారం చేసి గొప్ప కొడుకు అనిపించుకున్నాడు. 

మరిన్ని వార్తలు