Roger Federer: 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌.. 310 వారాలు వరల్ట్‌ నెం1.. దటీజ్‌ రోజర్‌ ఫెడరర్‌

27 Nov, 2022 09:58 IST|Sakshi

20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలవడమే అతని ఘనత కాదు... 310 వారాలు వరల్డ్‌ నంబర్‌వన్‌ గా ఉండటమే అతని గొప్పతనాన్ని చెప్పదు... పురుషుల టెన్నిస్‌ ఆట కూడా అందంగా ఉంటుందని, అలా ‘సాఫ్ట్‌ టచ్‌’తో కూడా అద్భుతాలు చేయవచ్చని అతను చూపించాడు. 

ఒక్క పాయింట్‌ కోల్పోతేనే రాకెట్‌ నేలకేసి విసిరికొట్టే ఈ తరం ఆటగాళ్లతో పోలిస్తే, దాదాపు పాతికేళ్ల ప్రొఫెషనల్‌ కెరీర్‌లో వివాదాస్పద మాట పెదవి దాటకుండా పనిపైనే దృష్టి పెట్టిన రుషి అతను.. మైదానం బయట కూడా సామాజిక బాధ్యత మరవని మంచితనం  అతని సొంతం..

కోర్టులో అతనితో భీకరంగా తలపడిన ప్రత్యర్థులు  అందరూ ఆట ముగియగానే అతని అంత మంచివాడు ఎవరూ లేరని ముక్తకంఠంతో చెప్పగల ఒకే ఒక్క పేరు.. రోజర్‌ ఫెడరర్‌.. టెన్నిస్‌ ప్రపంచంలో అన్నీ సాధించిన పక్కా జెంటిల్‌మన్‌ .

ఎనిమిదేళ్ల వయసులో ఫెడరర్‌ మొదటిసారి టెన్నిస్‌ రాకెట్‌ పట్టాడు. సరదాగా మాత్రమే ఆట మొదలు పెట్టినా, సహజ ప్రతిభ ఎక్కడికి పోతుంది? అందుకే కావచ్చు.. తాను ఎక్కువగా శ్రమించకుండానే వరుస విజయాలు వచ్చి పడ్డాయి. అండర్‌12 స్థాయిలో రెండు జాతీయ టైటిల్స్‌తో అతను మెరిశాడు. అయితే అసలు కష్టం రోజర్‌కు ఇప్పుడొచ్చింది. స్విస్‌ జాతీయ టెన్నిస్‌ సమాఖ్య అతని ఆటను ప్రత్యేకంగా గుర్తించింది.

వెంటనే నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో చేర్చించమని తల్లిదండ్రులకు సూచించింది. తానుండే బాసెల్‌ నుంచి డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఉన్న ఎక్యూబ్‌లె¯Œ ్స దాదాపు 200 కిలోమీటర్లు. అమ్మా, నాన్నని వదిలి వెళ్లలేనంటూ ఆ చిన్నారి ఏడ్చేశాడు. చివరకు ఒప్పించి అక్కడికి పంపించారు. కానీ తీరా వెళ్లాక ఆ సెంటర్‌లో అంతా ఫ్రెంచ్‌ భాషనే! తనకేమో ఇంట్లో నేర్చిన జర్మన్‌ స్విస్‌ భాష తప్ప ఏమీ రాదు.

పైగా క్యాంప్‌లో అందరికంటే చిన్నవాడు. బాధ మరింత పెరిగింది! కానీ ప్రతిరోజు ఫోన్‌ లో అమ్మతో మాట్లాడుతూ తెచ్చుకున్న ధైర్యానికి తన పట్టుదల జోడించి అక్కడి గట్టిగా నిలబడ్డాడు. అదే వేదిక భవిష్యత్‌ అద్భుతాలకు పునాదిగా నిలిచింది. దేశ నిబంధనల ప్రకారం తప్పనిసరి అయిన ‘9 ఏళ్ల స్కూల్‌ చదువు’ ముగించిన తర్వాత రోజర్‌ పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టి దూసుకుపోయాడు. ఎడ్‌బర్గ్, బెకర్‌లను ఆరాధిస్తూ పెరిగిన ఆ కుర్రాడు మునుముందు  తాను వారందరినీ మించి శిఖరాన నిలుస్తాడని ఊహించలేదు. 


వెనక్కి తగ్గకుండా...
‘ఎప్పుడూ కింద పడకపోవడంలో గొప్పతనం ఏమీ లేదు. కానీ పడ్డ ప్రతీసారి పైకి లేవడమే గొప్ప’... కన్ఫ్యూషియస్‌ చెప్పిన ఈ స్ఫూర్తిదాయక మాట ఫెడరర్‌కు అక్షరాలా వర్తిస్తుంది. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. సుదీర్ఘ కెరీర్‌లో పదుల సంఖ్యలో అతడు గాయపడ్డాడు. శరీరంలో భుజాల నుంచి కాలి మడమల వరకు వేర్వేరు గాయాలు అతడిని ఇబ్బంది పెట్టాయి.

కానీ అతను తన ఆటను ఆపలేదు. ఫెడరర్‌ పని అయిపోయిందనుకున్న ప్రతీసారి మళ్లీ బలంగా పైకి లేచాడు. మళ్లీ గొప్ప విజయాలతో దూసుకుపోయాడు. అతనిలో ఈ గొప్పతనమే అందరికీ స్ఫూర్తినిస్తుంది. అందుకే 36 ఏళ్ల వయసులో అతను మళ్లీ నంబర్‌వన్‌ అయ్యాడు. 24 ఏళ్లు అంతర్జాతీయ టెన్నిస్‌ ఆడినా..1526 సింగిల్స్, 224 డబుల్స్‌ మ్యాచ్‌లలో ఒక్కసారి కూడా గాయం కారణంగా మ్యాచ్‌ మధ్యలో తప్పుకోలేదు. అది అతని పట్టుదలకు నిదర్శనం. ఒక్కసారి ఆట మొదలు పెడితే అది గెలుపో, ఓటమే తేలిపోవాల్సిందే తప్ప మధ్యలో ఆయుధాలు పడేసే రకం కాదు అతను. 


డబుల్స్‌.. మిక్స్‌డ్‌ డబుల్స్‌..
‘ఆమె లేకపోతే నా ఆట ఎప్పుడో ముగిసిపోయేది. ఎన్నో క్లిష్ట సందర్భాల్లో నేను టెన్నిస్‌ ప్రయాణం ఆపేయాలని అనుకున్నా, తాను అండగా నిలిచి నాలో స్ఫూర్తి నింపింది’ అని భార్య మిరొస్లావా (మిర్కా) గురించి ఫెడరర్‌ తరచూ చెప్పేవాడు. ఆమె కూడా అంతర్జాతీయ టెన్నిస్‌ ప్లేయరే. నాలుగు గ్రాండ్‌స్లామ్‌లతో పాటు 2000 సంవత్సరం.. సిడ్నీ ఒలింపిక్స్‌లో కూడా స్విట్జర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించింది.

ఆటగాళ్లుగా అక్కడే తొలి పరిచయం.. అదే టోర్నీలో తొలి ముద్దు కూడా! అయితే 2002లో గాయంతో ఆటకు దూరమైన మిర్కా ఆ తర్వాత ఫెడరర్‌ సహాయక సిబ్బందిలో భాగమైంది. ఆ సమయంలోనే ఆమె వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసిన ఫెడరర్‌ మనసు పారేసుకున్నాడు. 2009లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు నలుగురు పిల్లలు.. వారిద్దరూ రెండు జతల కవలలు కావడం విశేషం. మైలా, చార్లిన్‌  అనే అమ్మాయిల జంట.. వారికంటే ఐదేళ్లు చిన్నదైన లియో, లెన్నీ అబ్బాయిల జంటతో రోజర్‌ కుటుంబ ఆనందం నాలుగింతలైంది. అన్నట్లు ఫెడరర్‌కు రెండేళ్లు పెద్దదైన అక్క డయానా కూడా ఉంది.

దాతృత్వంలో మేటి
అక్షరాలా 19 లక్షల 80 వేలు.. ఫెడరర్‌ సేవా కార్యక్రమాల్లో భాగంగా వివిధ దేశాల్లో పాఠశాలల్లో సౌకర్యాలు, విద్యా సదుపాయాలను ఉపయోగించుకొని ప్రయోజనం పొందిన విద్యార్థుల సంఖ్య అది. తన ఫౌండేషన్‌ ద్వారా సొంత దేశం స్విట్జర్లాండ్‌లో పలు విరాళాలు అందించిన ఫెడరర్‌ అంతకంటే మెరుగైన పని తాను చేయాల్సి ఉందని గుర్తించాడు. అందుకు తన అమ్మమ్మ దేశమైన దక్షిణాఫ్రికాను ఎంచుకున్నాడు.

దక్షిణాఫ్రికాతో పాటు పొరుగు దేశాలు లెసొతొ, మలావి, నమీబియా, జాంబియా, జింబాబ్వేలలో పాఠశాల విద్యను మెరుగుపరచడంలో అతని నిధులు ఉపయోగపడుతున్నాయి. ఇందు కోసం గత కొన్నేళ్లలో అతని సంస్థ సుమారు రూ. 569 కోట్లు ఖర్చు చేసింది. దాదాపు 10 వేల పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరచింది. ఫెడరర్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఈ యజ్ఞంలో అతని వ్యక్తిగత స్పాన్సర్లంతా భాగం పంచుకొని సహకారం అందించారు. రోజర్‌ ఆటతో పాటు ఇలాంటి దాతృత్వం అతడిని ఇతర స్టార్లకంటే ఒక మెట్టు పైన ఉంచింది. 

వివాదమా.. నీవెక్కడ?
అంతర్జాతీయ స్టార్‌ ఆటగాడంటే ఒక రేంజ్‌లో ఉండాలి. ఆటలోనే కాదు, మాటల్లో కూడా పదును కనిపించాలి. అప్పుడప్పుడు అవసరం ఉన్నా, లేకపోయినా ‘తానేంటో’ గుర్తించేలా నాలుగు పరుష పదాలు వాడటమో, లేదంటే వివాదాస్పద వ్యాఖ్యలో చేస్తుండాలి. కానీ ఫెడరర్‌ గురించి గూగుల్‌ చేసి చూడండి. వివాదం అన్న పదం కూడా కనిపించదు! గ్రాండ్‌స్లామ్‌లు గెలిచినప్పుడు సంబరాలు చేసుకున్నా, ఓడినప్పుడు ప్రత్యర్థిని అభినందించినా ఎక్కడా మాటలో, ప్రవర్తనలో కట్టు తప్పలేదు. అదే అతడి గొప్పతనాన్ని రెట్టింపు చేసింది. కావాలంటే 21 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన జొకోవిచ్‌ను చూడండి.. 21కి తగ్గని వివాదాలు ఉంటాయి. కానీ ఈ స్విస్‌ స్టార్‌ మాత్రం ఎప్పటికీ వాటికి దూరమే. 

ఫెడరర్‌ ఎక్స్‌ప్రెస్‌ 

 ►వరుసగా 237 వారాల పాటు వరల్డ్‌ నంబర్‌వన్‌
 ► గెలిచిన మొత్తం టైటిల్స్‌ 103
► స్విట్జర్లాండ్‌ దేశం ఫెడరర్‌ పేరిట పోస్టల్‌ స్టాంప్‌తో పాటు నాణేలపై కూడా అతని ఫొటోను ముద్రించింది. ఆ దేశంలో బతికి ఉండగానే అలాంటి గౌరవం అందుకున్న ఏకైక వ్యక్తి. 
 ► సొంత నగరం బాసెల్‌లో ‘ఫెడరర్‌ ఎక్స్‌ప్రెస్‌’ అని ఒక రైలుకు పేరు పెట్టారు. 
 ► ఆట ద్వారా సుమారు 130 మిలియన్‌ డాలర్లు ఆర్జిస్తే, ప్రకటనల ద్వారా మరో 100 మిలియన్లకు పైగా రోజర్‌ సంపాదించాడు. 30 ఏళ్ల ‘ఫోర్బ్స్‌’ చరిత్రలో నంబర్‌వన్‌ గా నిలిచిన తొలి టెన్నిస్‌ ప్లేయర్‌. 

మరిన్ని వార్తలు