Nikhat Zareen: ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్‌కు షాకిచ్చిన తెలంగాణ బాక్స‌ర్‌

26 Feb, 2022 16:41 IST|Sakshi

Nikhat Zareen Enters Finals Of Strandja Memorial Boxing: బ‌ల్గేరియా వేదిక‌గా జ‌రుగుతున్న 73వ ఎడిష‌న్ స్టాంజా మెమోరియ‌ల్ బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ (25) పంజా విసిరింది. శుక్రవారం జరిగిన మహిళల 52 కేజీల విభాగం సెమీస్‌లో టోక్యో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ బుసె నాజ్‌ కకిరోగ్లు (టర్కీ)పై 4-1 తేడాతో విజయం సాధించి, ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ పోరులో ఆది నుంచే పూర్తి ఆధిప‌త్యం ప్రదర్శించిన నిఖ‌త్‌.. తనదైన పంచ్‌లతో విరుచుకుపడి ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నిఖ‌త్ చివ‌రిసారిగా 2019లో ఈ టోర్నీ ఛాంపియ‌న్‌గా నిలిచింది.

మ‌రోవైపు 48 కేజీల విభాగంలో నీతు గంగాస్ (హ‌ర్యానా) కూడా ఫైనల్లోకి అడుగుపెట్టింది. నీతు.. సెమీస్‌లో ఉక్రెయిన్‌ బాక్సర్‌, 2018 వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్షిప్స్ ర‌జ‌త ప‌త‌క విజేత‌ హన్నా ఒఖోతాను చిత్తుగా ఓడించి స్వ‌ర్ణ ప‌త‌క పోరుకు అర్హ‌త సాధించింది. నీతు పంచ్‌ల‌ ధాటికి ప్రత్యర్థి రెండో రౌండ్లో కుప్పకూలిపోయింది. ఇక ఇదే టోర్నీలో యూత్‌ ప్రపంచ ఛాంపియన్‌ అరుంధతి చౌదరీ (70 కేజీలు), పర్వీన్‌ (63 కేజీలు)ల‌కు నిరాశ తప్పలేదు. క్వార్టర్స్‌లో అరుంధతి 1-4తో ఒలింపిక్‌ ఛాంపియన్‌ బుసెనాజ్‌ సుర్మెనెలి (టర్కీ) చేతిలో, పర్వీన్‌ 2-3తో నటాలియా (రష్యా) చేతిలో ఓట‌మిపాల‌య్యారు.
చ‌ద‌వండి: గెలిస్తే నిఖత్‌కు పతకం ఖాయం
 

మరిన్ని వార్తలు