IPL 2023: మధ్యలో డిస్టర్బ్‌ చేయడం ఎందుకో? హార్దిక్‌ను ఏకిపారేసిన గావస్కర్‌.. పైగా

31 May, 2023 18:40 IST|Sakshi
ఆఖరి ఓవర్లో మోహిత్‌తో హార్దిక్‌ పాండ్యా ముచ్చట (PC: IPL)

IPL 2023 Final CSK Vs GT- Winner CSK: ‘‘ఆఖరి ఓవర్‌లో మొదటి 3-4 బంతులు అతడు అద్బుతంగా బౌల్‌ చేశాడు. కానీ ఏంటో అనూహ్యంగా మధ్యలో హార్దిక్‌ పాండ్యా వచ్చాడు. అతడితో ఏదో మాట్లాడాడు. నిజానికి ఓ బౌలర్‌ మంచి రిథమ్‌, లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేస్తున్నపుడు అతడిని ఎవరూ డిస్టర్బ్‌ చేయకూడదు.

అతడు సరైన దిశలో పయనిస్తున్నపుడు అనవసరంగా సలహాలు ఇవ్వడం ఎందుకు? దూరం నుంచి చూసి మనం.. అతడు అలా బౌల్‌ చేస్తున్నాడు. ఇలా బౌల్‌ చేస్తున్నాడు అని విశ్లేషణలు చేస్తూ ఉంటాం. సదరు బౌలర్‌ ఫామ్‌లో ఉన్నపుడు ఎవరైనా అంత వరకే ఆగిపోవాలి.

అంతేగానీ.. అతడి దగ్గరికి వెళ్లి సలహాలు, సూచనలు ఇవ్వడం సరికాదు. పాండ్యా అక్కడికి వెళ్లగానే ఒక్కసారిగా మోహిత్‌ ముఖమే మారిపోయింది. అతడు బిత్తరచూపులు చూడటం మొదలుపెట్టాడు. ఆ వాటర్‌ బాటిల్‌ ఎందుకో’’ అని టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అన్నాడు.

హార్దిక్‌ పాండ్యా చేసిన పనేమీ బాగా లేదని విమర్శలు గుప్పించాడు. కాగా ఐపీఎల్‌-2023 ఫైనల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌- గుజరాత్‌ టైటాన్స్‌ తలపడిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా రిజర్వ్‌ డే అయిన సోమవారం(మే 29) జరిగిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో సీఎస్‌కే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

తద్వారా ఐదోసారి ట్రోఫీ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవాలనుకున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ ఆశలపై నీళ్లు చల్లింది. ఇక వర్షం కారణంగా లక్ష్య ఛేదనలో 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో గుజరాత్‌ పేసర్‌ మోహిత్‌ శర్మ చేతికి బంతినిచ్చాడు కెప్టెన్‌ పాండ్యా.

అప్పటికి శివం దూబే, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో మొదటి బంతిని పర్ఫెక్ట్‌ యార్కర్‌గా మలిచిన మోహిత్‌.. దూబేకు పరుగు తీసే అవకాశం ఇవ్వలేదు. రెండో బాల్‌ కూడా యార్కరే. ఈసారి దూబే ఒక పరుగు తీయగలిగాడు.

ఇక మూడో బంతికి కూడా అద్భుతమైన యార్కర్‌ సంధించి సీఎస్‌కే అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. నాలుగో బంతి కూడా సేమ్‌. ఈ క్రమంలో చెన్నై విజయసమీకరణం 2 బంతుల్లో 10 పరుగులుగా మారింది. జడ్డూ క్రీజులో ఉన్నాడు. ప్రేక్షకుల్లో నరాలు తెగే ఉత్కంఠ.

అంతలో హార్దిక్‌ పాండ్యా వచ్చి మోహిత్‌తో ముచ్చటించాడు. ఆ తర్వాతి బంతిని జడ్డూ సిక్సర్‌గా మలిచాడు. విజయానికి ఒక్క బంతికి నాలుగు పరుగులు కావాల్సిన తరుణంలో జడ్డూ బౌండరీ బాది సీఎస్‌కేను చాంపియన్‌గా నిలిపాడు.ఈ నేపథ్యంలో సునిల్‌ గావస్కర్‌ ఆఖరి ఓవర్‌ హైడ్రామా గురించి ఇండియా టుడేతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. 

చదవండి: సీఎస్‌కేకు ఫైనల్లో అడ్వాంటేజ్‌ అంటూ ట్వీట్‌! నీకెందుకంత అక్కసు? మరి ముంబై అయితే..

మరిన్ని వార్తలు