Asia Cup 2022: అప్పుడు స్ట్రెచర్‌పై అలా.. ఇప్పుడు పాకిస్తాన్‌పై చేలరేగి! శభాష్‌ హార్దిక్‌

30 Aug, 2022 07:12 IST|Sakshi

దుబాయ్‌: సరిగ్గా నాలుగేళ్ల క్రితం...ఇదే వేదికపై ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తోనే జరిగిన వన్డేలో బౌలింగ్‌ చేస్తూ హార్దిక్‌ పాండ్యా తీవ్రంగా గాయపడ్డాడు. స్ట్రెచర్‌పై అతడిని మైదానం నుంచి బయటకు తీసుకుపోవాల్సి వచ్చింది. ఒకదశలో ఈ వెన్ను గాయం అతడి కెరీర్‌నే ముగించేలా అనిపించింది. అయితే హార్దిక్‌ అన్ని అవరోధాలను అధిగమించి మళ్లీ పైకి లేచాడు.

సర్జరీల అనంతరం కోలుకొని ఆటపై దృష్టి పెట్టాడు. అయితే భుజం గాయంతో గత ఏడాది యూఏఈలోనే జరిగిన టి20 ప్రపంచకప్‌లో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గానే ఆడిన అతను ఇప్పుడు తన అసలు సత్తాను చూపించాడు. పాత హార్దిక్‌ను గుర్తు చేస్తూ అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో చెలరేగి తన విలువేంటో చూపించాడు. ‘ఆ రోజు నాకు బాగా గుర్తుంది.

అప్పటి పరిస్థితితో ఈ రోజును పోల్చి చూసుకుంటే ఎంతో సాధించిన ఆనందం కలుగుతోంది. నేను ఒకప్పటి ఆటగాడిలా మళ్లీ కనిపించేందుకు ఈ నాలుగేళ్లు ఎంతో కష్టపడ్డాను. నా ఈ ప్రయాణంలో చాలా మంది సహకరించారు’ అని హార్దిక్‌ అన్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో గెలుపు విషయంలో తనకు ఎలాంటి సందేహం లేదని అతను వ్యాఖ్యానించాడు.

అసలు ఎలాంటి ఒత్తిడి ఎదుర్కోలేదని పాండ్యా చెప్పాడు. ‘చివరి ఓవర్లో 7 పరుగులు అనేది పెద్ద విషయం కాదు. 15 పరుగులైనా సాధించగలననే నమ్మకం నాకుంది. నాకంటే బౌలర్‌ నవాజ్‌పైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని తెలుసు.

అందుకే ప్రశాంతంగా నా పని పూర్తి చేశాను. జట్టుగా కూడా మాకు ఇది కీలక విజయం. ఎలాంటి స్థితిలోనైనా ఆడగలమని నిరూపించాం. మా లక్ష్యం ఈ టోర్నీ మాత్రమే కాదు. ప్రపంచకప్‌ వరకు ఇదే జోరు కొనసాగించడమే ముఖ్యం’ అని హార్దిక్‌ స్పష్టం చేశాడు.
చదవండి: Hardik Pandya: అతడు కెప్టెనా? ఫిట్‌నెస్‌ పరీక్షలో నెగ్గుతాడా? బౌలింగ్‌ చేయగలడా? పడిలేచిన కెరటంలా..

మరిన్ని వార్తలు