భారత డేవిస్‌ జట్టులో నగాల్‌కు చోటు

22 Jul, 2022 02:06 IST|Sakshi

దివిజ్‌ శరణ్‌ అవుట్‌

న్యూఢిల్లీ: భారత డేవిస్‌ కప్‌ జట్టులోకి సుమిత్‌ నగాల్‌ తిరిగి ఎంపికయ్యాడు. గతేడాది మార్చిలో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో పోటీపడిన నగాల్‌ తర్వాత డేవిస్‌ బరిలో దిగలేదు. తుంటి గాయంతో గత సెప్టెంబర్‌లో ఫిన్లాండ్‌తో జరిగిన పోరుకు దూరమయ్యాడు. నవంబర్‌లో శస్త్ర చికిత్స తర్వాత విశ్రాంతి తీసుకోవడంతో ఈ ఏడాది మార్చిలో డెన్మార్క్‌తోనూ బరిలోకి దిగలేకపోయాడు.

ఏప్రిల్‌లో ఏటీపీ సర్క్యూట్‌లో ఆడటం మొదలుపెట్టిన 24 ఏళ్ల హరియాణా టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ ఈ సీజన్‌లో ఎనిమిది టోర్నీల్లో తలపడి నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచాడు. సుమిత్‌ డేవిస్‌ జట్టులోకి రావడంతో డబుల్స్‌ స్పెషలిస్టు దివిజ్‌ శరణ్‌ను పక్కన బెట్టారు. వరల్డ్‌ గ్రూప్‌–1 పోరులో భాగంగా సెప్టెంబర్‌ 16, 17 తేదీల్లో నార్వేతో భారత్‌ తలపడుతుంది.

మ్యాచ్‌లు నార్వేలో జరుగుతాయి. రోహిత్‌ రాజ్‌పాల్‌ సారథ్యంలో ఆరుగురు సభ్యుల భారత డేవిస్‌ జట్టును గురువారం ఎంపిక చేశారు. రామ్‌కుమార్‌ రామనాథన్, ప్రజ్నేశ్‌ గునేశ్వరన్, యూకీ బాంబ్రీ, శశికుమార్‌ ముకుంద్‌లతో పాటు వెటరన్‌ డబుల్స్‌ ప్లేయర్‌ రోహన్‌ బోపన్న భారత జట్టుకు ఎంపికయ్యారు. భారత్, నార్వే జట్లు తలపడటం డేవిస్‌ కప్‌ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీ వేదికగా జరిగిన డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ ప్లే–ఆఫ్‌లో భారత్‌ 4–0తో డెన్మార్క్‌పై ఘనవిజయం సాధించింది. 

మరిన్ని వార్తలు