Shane Warne: ‘నేను వార్న్‌ను అంతమాట అనకుండా ఉండాల్సింది’

8 Mar, 2022 07:38 IST|Sakshi

ముంబై: ఒక వ్యక్తి మరణించినప్పుడు అతనికి నివాళులు అర్పి స్తూ నాలుగు మంచి మాటలు చెప్పడం సహజం. బతికినప్పుడు ఎలా ఉన్నా చనిపోయినప్పుడు ప్రత్యర్థులు కూడా ఏదో ఒక మంచి అంశాన్ని ఎంచుకొని తమ స్పందనను తెలియజేస్తారు. కానీ వార్న్‌ మృతి సమయంలో టీవీ చర్చలో పాల్గొంటూ భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ చేసిన వ్యాఖ్య తీవ్ర విమర్శలకు దారి తీసింది.

వార్న్‌ గొప్పతనం గురించి యాంకర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘నా దృష్టిలో వార్న్‌ అత్యుత్తమ స్పిన్నర్‌ కాదు. భారత స్పిన్నర్లు, ముత్తయ్య మురళీధరన్‌ అంతకంటే మెరుగైన వాళ్లు. భారత్‌లో అతని రికార్డు చాలా సాధారణంగా ఉంది. ఒక్కసారి మాత్రమే అది టెయిలెండర్‌ జహీర్‌ గుడ్డిగా బ్యాట్‌ ఊపితే అతను ఐదు వికెట్లు తీయగలిగాడు. భారత్‌పై రాణించలేకపోయిన వార్న్‌కంటే మురళీనే గొప్పోడు’ అని గావస్కర్‌ అన్నాడు. దాంతో అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. వార్న్‌ను విమర్శించేందుకు ఇదా సమయం అనడంతో పాటు పోలికలు తీసుకురావడమేమిటని క్రికెట్‌ అభిమానులు విరుచుకుపడ్డారు.

దాంతో సోమవారం గావస్కర్‌ దీనిపై వివరణ ఇచ్చాడు. ‘ఆ ప్రశ్న అడిగేందుకు, దానికి నేను జవాబు ఇచ్చేందుకు కూడా అది సరైన సమయం కాదు. క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో వార్న్‌ ఒకడు’ అని సన్నీ వ్యాఖ్యానించాడు. నిజానికి భారత గడ్డపై మురళీ సగటు (45.45)కంటే వార్న్‌ సగటే (43.11) కాస్త మెరుగ్గా ఉంది.    

చదవండి: Shane Warne Death: విషాద సమయంలో ఇలాంటివి అవసరమా.. గావస్కర్‌పై విమర్శలు!

Shane Warne Death: వార్న్‌ మరణం నా హృదయాన్ని ముక్కలు చేసింది

మరిన్ని వార్తలు